ఏపీకి భారీ వర్ష సూచన - తీర ప్రాంతంలో బలమైన గాలులు, ఈ జిల్లాలకు హెచ్చరికలు!
AP Heavy Rains Alert : దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
AP Heavy Rains Alert : ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ (ఆదివారం, సెప్టెంబర్ 13) పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- భారీ వర్షాలు కురిసే జిల్లాలు : ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం మరియు ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- మోస్తరు వర్షాలు: అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
- తేలికపాటి జల్లులు: రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి.
మత్స్యకారులకు హెచ్చరికలు…
తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రయాణికులు, స్థానికులు పాత చెట్లు, పెద్ద హోర్డింగ్‌లు మరియు విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉంది. ఉధృతంగా పారే వాగులు, కాలువలు దాటేందుకు ఎవరూ సాహసించవద్దు. సముద్రం అశాంతంగా ఉన్నందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
పొంగుతున్న వాగులు…
మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్‌తోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని, కొన్ని గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వివరించారు.
అధికారులు అందించిన సమాచారం ప్రకారం…. జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
వర్షాలు తగ్గే వరకు ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట తక్షణమే పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

