ఏపీకి భారీ వర్ష సూచన - ఐఎండీ హెచ్చరికలు జారీ, ఇవాళ ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు..!

అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. 

Published on: Oct 23, 2025, 04:00:14 IST
By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం… ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది.

ఏపీకి భారీ వర్ష సూచన
ఏపీకి భారీ వర్ష సూచన

ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

తీరం వెంబడి గంటకు 35-55కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. అత్యవసర సహయక చర్యల కోసం 1 NDRF, 4 SDRF బృందాలని ప్రభావిత జిల్లాలకు పంపించామన్నారు.

విద్యా సంస్థలకు సెలవు…!

భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు ఇవాళ(గురువారం) సెలవు ప్రకటించారు. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇక నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలు కూడా మూసివేసి ఉంటాయి. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాలపై సీఎస్ సమీక్ష - కీలక ఆదేశాలు

భారీ వర్షాల నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతో పాటు ఎపిఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్ శ్రీ కె విజయానంద్ మాట్లాడుతూ…. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం కారణంగా రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపధ్యంలో అన్నీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందని తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సహయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.

ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లలో సిబ్బంది 24/7 అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. అదేవిధంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన మేరకు సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సమాచారం అందించాలని ఆయన సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More