పోలవరంలో హై అలర్ట్.. పులిని పట్టుకునేందుకు రంగంలోకి హనుమాన్ రెస్క్యూ టీమ్!

పోలవరంలో పెద్దపులి కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలంలోని గ్రామాల్లో సంచరిస్తోంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Published on: Jun 7, 2026, 14:39:53 IST
By , Polavaram
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పాత నేలకోట గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తూ కనిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో థర్మల్ డ్రోన్ కెమెరాకు పులి చిక్కింది. ఈ క్రమంలోనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై, పులిని సురక్షితంగా బంధించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పూడిపల్లి-నేలకోట మధ్యన కొండ ప్రాంతంలో ఉన్నట్టుగా గుర్తించారు.

పోలవరంలో పులి సంచారం
పోలవరంలో పులి సంచారం

పులి కదలికలపై నిరంతర నిఘా ఉంచిన అధికారులు, దానిని పట్టుకునేందుకు అత్యాధునిక సాంకేతికతను, నిపుణుల బృందాలను రంగంలోకి దించారు. పులిని ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక వన్యప్రాణి నిపుణుల బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 150 మందితో కూడిన హనుమాన్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. పులిని బంధించేందుకు అత్యాధునిక రక్షణ సామాగ్రిని వెంట తెచ్చుకున్నారు.

ప్రస్తుతం ఈ నిపుణుల బృందం పులి అనుకూలమైన ప్రదేశానికి వచ్చే వరకు వేచి చూస్తోంది. పులికి, సిబ్బందికి ఎలాంటి ముప్పు లేని సురక్షిత ప్రాంతంలో దానికి మత్తుమందు ఇచ్చి, బోనులో బంధించాలని అధికారులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ పులిని పట్టుకునేందుకు అటవీ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, వివిధ వన్యప్రాణి సంస్థల నిపుణులతో కూడిన సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. 24 గంటల పాటు షిఫ్టుల వారీగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

స్థానిక ప్రజలు, పశువుల రక్షణతో పాటు, పులి ప్రాణాలకు కూడా ఎలాంటి హాని కలగకుండా దానిని సంరక్షించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పులిని తక్షణమే బంధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు గ్రామస్థులను అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి లేదా పొలాల్లోకి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది.

పులి గ్రామాల్లోకి ప్రవేశించకుండా ఉండటానికి డ్రోన్లు, హైపవర్ లైట్స్, శబ్ధ పరికరాలను ఉపయోగిస్తున్నారు. జనాల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని, అడవికి సమీప ప్రాంతాలకు వెళ్లకూడదని ప్రజలకు సూచనలు జారీ చేశారు. మరోవైపు థర్మల్ డ్రోన్ల సాయంతో పులి కదలికలను రెస్క్యూ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

అటవీ శాఖ అధికారులు అందించిన సమాచారం ప్రకారం, ఈ పులి గత కొన్ని రోజులుగా స్థానిక పశువులపై ఎలాంటి కొత్త దాడులు చేయలేదు. ఆకలితో ఉన్న పులి ఎప్పుడు ఎటువైపు వస్తుందోననే ఆందోళన స్థానికుల్లో నెలకొంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More