Guntur GGH PET Scan : గుంటూరు GGHలో అత్యాధునిక 'పెట్' స్కాన్ - రూ.18 కోట్లతో ఏర్పాటు, ఇక ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు
Guntur GGH PET Scan : గుంటూరు జీజీహెచ్ (GGH)లో రూ. 18 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక 'పెట్ స్కాన్' సేవలను ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన ఈ పరికరంతో క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే ఉచితంగా గుర్తించవచ్చు.
Guntur GGH PET Scan : రాష్ట్రంలోని నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేస్తే తప్ప సాధ్యం కాని 'పెట్ స్కాన్' (PET Scan - Positron Emission Tomography) సదుపాయాన్ని గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH)లో అందుబాటులోకి తెచ్చింది. దాదాపు రూ.18 కోట్ల వ్యయంతో అమెరికా (USA) నుంచి ఈ అత్యాధునిక యంత్రాన్ని ప్రభుత్వం తెప్పించింది.

ఉచితంగా పరీక్షలు…
ప్రస్తుతం మన రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లోని 18 ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ పెట్ స్కాన్ సదుపాయం ఉంది. బయట మార్కెట్‌లో ఈ పరీక్ష చేయించుకోవాలంటే సామాన్యులు రూ.20 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అయితే… గుంటూరు జీజీహెచ్ ఆవరణలోని నాట్కో క్యాన్సర్ కేంద్రంలో ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
"పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వాసుపత్రుల్లోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టాం" అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కేంద్రాన్ని బుధవారం సాయంత్రం మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
క్యాన్సర్ కణం ఎక్కడున్నా పట్టేస్తుంది!
క్యాన్సర్ నిర్ధారణలో పెట్ స్కాన్ ఒక అద్భుతమైన మైలురాయి. సాధారణ సి.టి స్కాన్‌లో ఎముకలు, ఎంఆర్ఐలో కణజాలం కనిపిస్తాయి. కానీ శరీరంలో క్యాన్సర్ కణం ఎక్కడ దాగి ఉన్నా, అది ఏ దశలో ఉంది…? శరీరంలోని ఇతర భాగాలకు ఎంతవరకు విస్తరించింది అనే అంశాలను పెట్ స్కాన్ కచ్చితంగా గుర్తిస్తుంది. దీనివల్ల వైద్యులు రోగికి ఏ ప్రాంతంలో ఎంత మోతాదులో రేడియేషన్ ఇవ్వాలో ఖచ్చితత్వంతో నిర్ణయించగలదు. కేవలం క్యాన్సర్ మాత్రమే కాకుండా కార్డియాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ వంటి ఇతర సూపర్ స్పెషాలిటీ విభాగాల అవసరాలకు కూడా ఈ స్కాన్ ఎంతో ఉపయోగపడుతుంది.
నాట్కో క్యాన్సర్ కేంద్రాన్ని లెవల్-1 స్థాయి క్యాన్సర్ కేర్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం మొత్తం రూ.41 కోట్లతో ఆధునిక యంత్రాలను సమకూరుస్తోంది. ఇప్పటికే ఈ కేంద్రంలో లినాక్ (Linac), హెచ్‌ఏఆర్ బ్రాకీథెరపీ, సి.టి స్టిమ్యులేటర్ వంటి అత్యుత్తమ సర్జికల్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు పెట్ స్కాన్ చేరింది.
ట్రయల్ రన్ సమయంలో ఇప్పటికే 50 మంది రోగులకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు. ఈ కేంద్రం ద్వారా గత ఏడాది కాలంలో సుమారు 19,598 మంది ఓపీ సేవలు పొందగా.... వెయ్యి మందికి పైగా క్యాన్సర్ సర్జరీలు జరిగాయి. అవసరమైన 114 మంది స్పెషలిస్ట్ వైద్యులు, సిబ్బందిని కూడా ప్రభుత్వం నియమించి... ఈ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

