ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి? గుర్తించడం ఎలా?

మగవాళ్లలో చాలా సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. ప్రతి ఆరుగురిలో ఒకరికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

Published on: Apr 20, 2026 10:46 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, మన దేశంలో ఏడాదికి సుమారు 47 వేల కొత్త కేసులు వస్తున్నాయి. అంటే మొత్తం క్యాన్సర్ కేసుల్లో సుమారు 3 శాతం దీనిదే. ఇంకో 10-20 ఏళ్లలో ఇది మరింత పెరుగుతుంది అంటున్నారు.

ప్రొస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా
ప్రొస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా

ప్రోస్టేట్ క్యాన్సర్ కి ప్రధానమైన ప్రమాద కారణం - వయసే.  ఎందుకంటే... ఇప్పుడు, వైద్య సదుపాయాలు పెరిగి, టెక్నాలజీ తోడై, మనిషి ఆయుర్దాయం పెరుగుతోంది.  వయసు పెరిగిన వారిలో ఈ క్యాన్సర్ రిస్క్ కూడా ఆటోమాటిక్‌గా పెరుగుతుంది.

విస్తృతమైన స్క్రీనింగ్ టెస్టులు, క్యాన్సర్ పై అవగాహన, ఇంకా  ఫ్యామిలీ హిస్టరీ, జాతి, జన్యు కారణాలు (genetic factors) ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి.

ఉదాహరణకి, మీ కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిందంటే, మరీ ముఖ్యంగా 50 ఏళ్లలోపే వచ్చిందంటే, మీకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ప్రోస్టేట్ క్యాన్సర్ పై కొన్ని అపోహలు:

ప్ర : ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే పెద్దవారికే వస్తుంది. యువతకి రాదు.

జ : మొత్తమ్మీద కాస్త తక్కువే అయినా, పూర్తిగా నిజం కాదు. ఇప్పుడు 40 ఏళ్ల చివర్లో, 50 ఏళ్ల మొదట్లో కూడా కొన్ని కేసులు గుర్తిస్తున్నాం. గమనించాల్సిన విషయం ఏంటంటే, 50ఏళ్ళ వయసులో క్యాన్సర్ నిర్థారణ అయిన పురుషుల్లో, వ్యాధి ముదిరిన దశలోకి వెళ్లే ప్రమాదం, ఎక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్ర : లక్షణాలు లేవంటే ప్రోస్టేట్ క్యాన్సర్ లేనట్టేగా?

జ : ఇది నిజం కాదు.  ప్రోస్టేట్ క్యాన్సర్ మొదట్లో సైలెంట్ గానే ఉంటుంది.  చాలా మందికి, మూత్రనాళంలో సమస్యతో వచ్చినప్పుడు, పరీక్షలు చేస్తే క్యాన్సర్ బయటపడుతుంది.

ప్ర : ప్రోస్టేట్ క్యాన్సర్ ని  నివారించగలమా?

జ : నిజం చెప్పాలంటే, దీనికి స్పష్టమైన నివారణ లేదు. కానీ త్వరగా గుర్తిస్తే,  అంటే ముందుగానే స్క్రీనింగ్ చేయించుకుంటే క్యాన్సర్ కు చికిత్స చేసి, సులభంగా నియంత్రించవచ్చు.

ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా నెమ్మదిగా పెరుగుతుంది. అందువల్ల చికిత్స కి బాగా రెస్పాండ్ అవుతుంది. కానీ మనం ఆలస్యంగా డాక్టర్‌ దగ్గరికి వెళ్తే, అప్పటికి అది ముదిరిన దిశకు చేరుతుంది. అప్పుడు దాని నియంత్రణ దాదాపు అసాధ్యం .

ప్ర : మరి ఇప్పుడు ఏం చేయాలి? 

జ : సాధారణ రిస్క్ ఉన్న వాళ్లు, 60 వ ఏట నించీ స్క్రీనింగ్ చేయించుకోవాలి.

ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్లు లేదా జన్యు కారణాలు ఉన్నవాళ్లు, అంటే హై రిస్క్ ఉన్నవాళ్లు, 50 ఏళ్లకే స్క్రీనింగ్ ప్రారంభించాలి.

మీ ఫ్యామిలీ డాక్టర్ లేదా ఆంకాలజిస్ట్ని కలసి, వారి సలహా ప్రకారం పరీక్ష చేయించుకోండి. 

ప్ర : స్క్రీనింగ్ ఎలా చేయించుకోవాలి?

జ : ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఏమంత కష్టం కాదు, చాలా సులభంగా స్క్రీన్ చేయగలిగే క్యాన్సర్. ఏడాదికోసారి రక్త పరీక్షతో ప్రోస్టేట్ క్యాన్సర్ ఛాయలని  తెలుసుకోవచ్చు. మీ రక్తంలో S.PSA స్థాయి ఎక్కువగా ఉంటే, డాక్టర్ సలహాతో, నిర్దిష్ఠమైన పరీక్షలు చేయించుకుని, చికిత్స మొదలుపెట్టొచ్చు. 

ముందుగా కనిపెడితే... ముందుగానే ఆపొచ్చు.

- డాక్టర్ రామకృష్ణ, కన్సల్టెంట్, రేడియేషన్ ఆంకాలజీ

మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More