Cancer Symptoms : ఈ 5 మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.... లేదంటే 'క్యాన్సర్' ముప్పు తప్పదు!

Oral Cancer Symptoms : క్యాన్సర్ లక్షణాలు ప్రారంభంలో చాలా స్వల్పంగా ఉంటాయి. నొప్పి లేదని లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రాణాపాయానికి దారితీయవచ్చు. శరీరంలో కనిపించే 5 మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published on: Apr 24, 2026, 21:23:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Oral Cancer Symptoms : క్యాన్సర్ మహమ్మారి నిశ్శబ్దంగా శరీరాన్ని ఆక్రమిస్తుంది. భారతదేశంలో సాధారణంగా కనిపించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఊపిరితిత్తులు, నోటి మరియు రొమ్ము క్యాన్సర్లు ప్రారంభ దశలో చాలా స్వల్ప లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని మనం సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ…. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స చేయడం ఎంతో సంక్లిష్టంగా మారుతుంది. అందుకే శరీరంలో కనిపించే చిన్నపాటి మార్పులను కూడా గుర్తించడం చాలా అవసరం.

క్యాన్సర్ ముందస్తు సంకేతాలు..! (Unsplash)
క్యాన్సర్ ముందస్తు సంకేతాలు..! (Unsplash)

నోయిడాలోని మెదాంత హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అంకుర్ నందన్ వర్షనే ఈ విషయంపై కీలక విషయాలను పంచుకున్నారు. "నొప్పి లేకపోవడమే క్యాన్సర్ విషయంలో అతిపెద్ద శాపం. ప్రారంభంలో ఎటువంటి నొప్పి ఉండదు కాబట్టి, రోగులు తమ శరీరంలో వచ్చే చిన్న చిన్న గడ్డలను లేదా మార్పులను సహజంగా తగ్గిపోతాయని భావించి వదిలేస్తారు. తీరా అది ముదిరిన తర్వాత వైద్యులను సంప్రదిస్తే, పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంటుంది," అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.అందుకే…. ప్రతి ఒక్కరూ 5 ముఖ్యమైన సంకేతాలు గమనించుకోవాలని సూచించారు…..

1. నొప్పి లేని గడ్డలు లేదా వాపులు

శరీరంలో ఎక్కడైనా, ముఖ్యంగా రొమ్ము, మెడ, చంకలు లేదా వృషణాల్లో అసాధారణంగా గడ్డలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. చాలామంది ఈ గడ్డలు నొప్పి పెట్టడం లేదు కదా అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ…. అసాధారణ కణాల పెరుగుదల వల్ల వచ్చే గడ్డలు ప్రారంభంలో ఎటువంటి నొప్పిని కలిగించవు. గడ్డ చిన్నదైనా, పెద్దదైనా అది కొత్తగా కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

2. మానని పుండ్లు

భారత్ లో నోటి క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా పొగాకు వాడే వారిలో ఈ ముప్పు ఎక్కువ. నోటిలో, నాలుకపై లేదా చిగుళ్లపై వచ్చే పుండ్లు రెండు వారాలకు మించి మానకపోతే అది ప్రమాద సంకేతం కావొచ్చు. "నోటిలో పుండు 10 నుండి 14 రోజులలోపు తగ్గకపోతే, అది క్యాన్సర్ ముందస్తు లక్షణం అయ్యే అవకాశం ఉంది," అని డాక్టర్ వర్షనే హెచ్చరించారు.

3. అసాధారణ రక్తస్రావం లేదా స్రావాలు

శరీరంలోని ఏ భాగం నుంచైనా కారణం లేకుండా రక్తం రావడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. నోటి నుంచి, మల విసర్జన సమయంలో, మూత్రంలో లేదా జననేంద్రియాల నుంచి అసాధారణంగా రక్తస్రావం కావడం క్యాన్సర్ లక్షణం కావొచ్చు. మహిళల్లో నెలసరితో సంబంధం లేకుండా అసాధారణ యోని రక్తస్రావం కనిపిస్తే అది సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. అలాగే లాలాజలంలో రక్తం పడటం ఊపిరితిత్తుల లేదా గొంతు క్యాన్సర్‌కు సూచన కావొచ్చు.

4. తగ్గని దగ్గు….బొంగురు గొంతు

వాతావరణ కాలుష్యం లేదా ఇన్‌ఫెక్షన్ వల్ల దగ్గు రావడం సాధారణమే. కానీ, మూడు వారాలకు మించి దగ్గు తగ్గకపోయినా, గొంతు బొంగురుపోయినా దానిని తేలికగా తీసుకోకూడదు. ముఖ్యంగా ధూమపానం చేసేవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అవి ఊపిరితిత్తులు, గొంతు లేదా అన్నవాహిక క్యాన్సర్‌కు ప్రాథమిక సంకేతాలు కావచ్చు. మింగడానికి ఇబ్బందిగా ఉన్నా నిపుణులను సంప్రదించాలి.

5. అకస్మాత్తుగా బరువు తగ్గడం

ఎటువంటి డైటింగ్ లేదా వ్యాయామం చేయకుండానే అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం మంచి లక్షణం కాదు. అలాగే విశ్రాంతి తీసుకున్నా తగ్గని నిరంతర అలసట కూడా ప్రమాదకరమే. ఇవి రక్తం, ఊపిరితిత్తులు లేదా కడుపుకు సంబంధించిన క్యాన్సర్ల వల్ల వచ్చే అవకాశం ఉంది. వీటిని కేవలం పని ఒత్తిడి లేదా నీరసంగా భావించి కాలయాపన చేయకూడదు.

క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే తక్కువ ఖర్చుతో, సులభమైన చికిత్స ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. "క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం అంటే కేవలం వ్యాధిని తెలుసుకోవడం మాత్రమే కాదు… రోగికి మెరుగైన జీవన ప్రమాణాలను మరియు సంపూర్ణ ఆరోగ్య అవకాశాన్ని అందించడం," అని డాక్టర్ వర్షనే స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More