గుండెకు పరుగు బలం: రక్తపోటు తగ్గడానికి ఏరోబిక్ వ్యాయామం ఎలా పనిచేస్తుంది?
ఏరోబిక్ వ్యాయామం (Aerobic Exercise) రక్తపోటును సమర్థవంతంగా తగ్గిస్తుంది. దీనిపై ప్రముఖ కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ అందించిన వివరాలు ఇక్కడ చూడొచ్చు. ఏరోబిక్ వ్యాయామం రక్తనాళాలకు తిరిగి శిక్షణనిచ్చి, వాటిని రిలాక్స్‌డ్ గా, సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది.
శరీరాన్ని కదపడం అనేది నిజంగానే ఓ ఔషధంలా పనిచేస్తుందని, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి వ్యాయామం చాలా కీలకం అని వైద్య నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అయితే, ఏరోబిక్ వ్యాయామం (Aerobic Exercise) అనేది రక్తపోటును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని ప్రముఖ హార్ట్ సర్జన్ ఒకరు వివరిస్తున్నారు.

జార్జియాకు చెందిన ప్రముఖ కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్, ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ కీలక విషయాన్ని పంచుకున్నారు. "నేను ఒక హార్ట్ సర్జన్‌గా చెబుతున్నాను, కదలిక అనేది నిజంగానే మందు. క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయడం కంటే సమర్థవంతంగా రక్తపోటును తగ్గించేవి చాలా తక్కువ" అని ఆయన బలంగా చెప్పారు. చురుకుగా ఉండటం, కదలికను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఆయన నొక్కిచెప్పారు.
రక్తనాళాలకు 'రిట్రైనింగ్' ఎలా పనిచేస్తుంది?
ఏరోబిక్ వ్యాయామం చేస్తున్నప్పుడు, మన రక్తనాళాల వ్యవస్థకు వాస్తవానికి ఒక రకమైన 'శిక్షణ' ఇస్తున్నట్టేనని డాక్టర్ లండన్ వివరించారు. ఈ శిక్షణ ద్వారా రక్తనాళాలు, ధమనులు మరింత సౌకర్యవంతంగా (flexible), రిలాక్స్‌డ్‌గా, చురుకుగా (responsive) ఉండడం నేర్చుకుంటాయి.
నైట్రిక్ ఆక్సైడ్ విడుదల కీలకం:
ఏరోబిక్ వ్యాయామం ద్వారా శరీరంలో జరిగే లోతైన, సానుకూల శారీరక ప్రభావాన్ని ఆయన వివరించారు. "ఏరోబిక్ శిక్షణ వల్ల సిస్టమిక్ వాస్కులర్ రెసిస్టెన్స్ (systemic vascular resistance) తగ్గుతుంది. దీని అర్థం ఏంటంటే, మీ రక్తనాళాలు సంకోచించడం తగ్గి, శరీరమంతా రక్తాన్ని పంపడానికి మీ గుండె అంతగా శ్రమించాల్సిన అవసరం ఉండదు" అని డాక్టర్ లండన్ తెలిపారు.
మీరు నడిచినా, పరుగెత్తినా, సైకిల్ తొక్కినా, లేదా ఈత కొట్టినా, మీ రక్తనాళాలు నైట్రిక్ ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది శక్తివంతమైన వాసోడైలేటర్ (Vasodilator). ఇది రక్తనాళాల గోడలను రిలాక్స్ చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
దీనర్థం, ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల మీ గుండె తన పనిని మరింత సులభంగా, సమర్థవంతంగా చేయడంలో మీరు సహాయం చేస్తున్నారన్నమాట.
ధమనులకు బలం
దీని గురించి డాక్టర్ లండన్ ఇంకా వివరిస్తూ, "క్రమంగా, ఈ పునరావృత చర్య మీ ధమనుల అంతర్గత పొర అయిన ఎండోథెలియం (endothelium)కు తిరిగి శిక్షణనిస్తుంది. దానివల్ల అవి మరింత రిలాక్స్‌డ్‌గా, సౌకర్యవంతంగా, చురుకుగా ఉంటాయి" అని చెప్పారు.
మరో మాటలో చెప్పాలంటే, ఏరోబిక్ కదలికలు స్థిరమైన (resilient) గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. ధమనులు రిలాక్స్‌డ్‌గా, వాటి నిరోధకత తగ్గినప్పుడు, రక్తం సులభంగా ప్రవహిస్తుంది. ఇది గుండె వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది, నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది
ఏరోబిక్ వ్యాయామం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గిస్తుంది. దాంతో శరీరం సహజంగా రిలాక్స్ అయ్యి, తిరిగి శక్తిని పుంజుకోవడానికి మద్దతు ఇస్తుంది.
"ఏరోబిక్ వ్యాయామం మీ సింపథెటిక్ నాడీ వ్యవస్థను కూడా నిశ్శబ్దం చేస్తుంది. ఇది రక్తనాళాల సంకోచానికి (vasoconstriction) కారణమయ్యే హార్మోన్లను తగ్గిస్తుంది. దీంతో ఒత్తిడి కూడా తగ్గుతుంది," అని డాక్టర్ లండన్ వివరించారు.
కాబట్టి, ఏరోబిక్ వ్యాయామం వల్ల డబుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ధమనులను రిలాక్స్‌డ్‌గా ఉంచడమే కాకుండా, ఒత్తిడిని కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది. దీనివల్ల రక్తపోటు తగ్గి, మొత్తంమీద గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజువారీ ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల, కాలక్రమేణా గుండె మరింత సమర్థవంతంగా పనిచేస్తూ, మనసు కూడా ప్రశాంతమైన స్థితికి చేరుకుంటుంది.
(పాఠకులకు గమనిక: ఈ కథనం సోషల్ మీడియాలో నిపుణుల ద్వారా పంచుకున్న సమాచారం ఆధారంగా రూపొందించింది. ఇది వైద్యపరమైన సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యపరమైన సందేహాలకు ఎల్లప్పుడూ వైద్య నిపుణులను సంప్రదించాలి.)

E-Paper












