అనంతపురంలో హనీట్రాప్.. డబ్బున్నోళ్లకు అమ్మాయిలతో కాల్స్.. ఆపై పర్సనల్ వీడియోలు!

Honey Trap : అనంతపురంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు హనీట్రాప్‌తో డబ్బున్నోళ్లను టార్గెట్ చేసుకున్నారు. అమ్మాయిలతో కాల్స్ చేయించారు. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది.

Published on: Apr 25, 2026, 07:17:39 IST
By , Anantapur
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అనంతపురం జిల్లాలో హనీట్రాప్ గుట్టురట్టైంది. అయితే అధికార పార్టీకి చెందిన ఇద్దరు అనుచరులు ఈ దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా అనంతపురంలో సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు వీరికి పోలీసులు కూడా సహకరిస్తున్నారని ప్రచారం జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

విశ్రాంత ఉద్యోగులు, పూజారులు, ధనవంతులను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ ముఠాలు పోలీసుల సహకారంతో పనిచేస్తున్నాయని విచారణలో వెల్లడైంది. ఏప్రిల్ 18న ఒక యువకుడు ఫిర్యాదు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. తనను ఒక ఇంటికి రప్పించి, దాడి చేసి, బట్టలు విప్పించి, అసభ్యకరమైన ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేశారని ఆ యువకుడు ఆరోపించాడు. అవమానానికి భయపడి బాధితుడు ఆ ముఠాకు సుమారు రూ. 4 లక్షలు చెల్లించినట్లు సమాచారం.

హనీ ట్రాప్ ముఠాతో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతో సహా డజనుకు పైగా సిబ్బందికి సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రాప్తాడు ఇన్‌స్పెక్టర్ శ్రీ హర్ష, త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రనాథ్ యాదవ్‌లను వీఆర్‌కు పంపినట్లు తెలుస్తోంది. మరికొంతమంది పోలీసులపై కూడా నిఘా ఉన్నట్లు తెలిసింది.

ఈ కేసులో రంగమ్మ, రాజేష్ అనే పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తిరుపతిలో గతంలో ఇలాంటి కేసులోనే నిందితురాలిగా రంగమ్మ అలియాస్ చిన్ని ఉంది. అయితే డబ్బు ఉన్నవాళ్లను ఈ హనీట్రాప్ గ్యాంగ్ టార్గెట్ చేసుకుంటుందట. వారికి అమ్మాయిలతో ఫోన్స్, మెసేజులు చేయించి.. ఇక ప్లాన్ ప్రకారం.. అవతలి వ్యక్తిని బుక్ చేసేస్తారని తెలిసింది. వ్యక్తిని రప్పించి, వీడియోలు తీసి.. ఆపై బెదిరింపులు మెుదలుపెడతారు.

అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ దందాను నడుపుతున్న ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, ఆయుధాలు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 100 మందికి పైగా లక్ష్యంగా చేసుకున్నారని, ఇప్పటివరకు సుమారు 20 మంది బాధితులు ముందుకు వచ్చారని అధికారులు తెలిపారు.

పోలీసు సిబ్బంది పాత్రతో సహా పలు అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించేందుకు ఎస్పీ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. హనీట్రాప్ గ్యాంగ్ సభ్యులకు, కొంతమంది పోలీసులకు మధ్య జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇటీవలి నెలల్లో ఈ ముఠా కనీసం 20 మంది బాధితులను లక్ష్యంగా చేసుకుని దాదాపు రూ.1 కోటి వసూలు చేసిందని అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పోలీసులు ఇప్పటివరకు సుమారు రూ.13 లక్షల నగదు, కత్తులు, ప్రామిసరీ నోట్లతో సహా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చాలా సిస్టమేటిక్‌గా ఈ హనీట్రాప్ ముఠాను నడిపించినట్టుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More