నంద్యాల బస్సు దగ్ధం.. డీసీఎం డ్రైవర్ 36 మంది ప్రాణాలను ఎలా కాపాడాడు?

నంద్యాల జిల్లాలో శిరివెళ్లమెట్ట వద్ద బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ప్రయాణికుల అందరినీ ఒక్క డీసీఎం డ్రైవర్ కాపాడాడు.

Published on: Jan 22, 2026, 11:22:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత బస్సు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. డీసీఎం వాహన డ్రైవర్ కారణంగా అనేక మంది ప్రాణాలతో బయటపడ్డారు.

నంద్యాల బస్సు ప్రమాదం
నంద్యాల బస్సు ప్రమాదం

ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్న ప్రైవేట్ బస్సు టైరు పేలి పోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను దాటి.. బస్సు అవతలి వైపు వెళ్లింది. అటు నుంచి వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు, కంటైనర్ ట్రక్కు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇద్దరు డ్రైవర్లు, ట్రక్కు క్లీనర్ గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు.

రెండు వాహనాలు ఢీకొన్నప్పుడు, ప్రైవేట్ బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. కాస్త ఆలస్యమైతే ప్రయాణికులు అంతా పెద్ద ప్రమాదంలో పడేవారు. బస్సు ప్రధాన ద్వారం, ఎమర్జెన్సీ విండో తెరవకపోవడంతో ప్రయాణీకులు తప్పించుకోలేకపోయారు.

అదృష్టవశాత్తూ ఆ ప్రాంతం గుండా వెళుతున్న ఒక డీసీఎం వాహన డ్రైవర్ మంటలను గమనించాడు. వెంటనే ఆగి ప్రయాణికులకు సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్రమత్తమై వెంటనే.. బస్సు అద్దాలను పగలగొట్టి 36 మంది ప్రయాణికులు తప్పించుకోవడానికి సహాయం చేశాడు. చాలా మంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కిటికీల గుండా దూకారు.

పోలీస్ అధికారి మధుసూదన్ ప్రకారం.. నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దురదృష్టవశాత్తు బస్సు డ్రైవర్, ట్రక్ డ్రైవర్, క్లీనర్ వాహనాల లోపల చిక్కుకుని సజీవ దహనం అయ్యారు.

బస్సు, కంటైనర్ ట్రక్కును త్వరగా చుట్టుముట్టిన మంటలు రెండు వాహనాలను బూడిద చేశాయి. ప్రయాణికుల సామాను, వ్యక్తిగత వస్తువులు దగ్ధమయ్యాయి. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. చివరికి, దెబ్బతిన్న వాహనాలను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

కేసు నమోదు చేశామని, ఏం జరిగిందో కచ్చితంగా తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించామని ఒక పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన ప్రయాణికుల నుండి స్టేట్‌మెంట్‌లు సేకరిస్తున్నామన్నారు. డీసీఎం డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More