ఏపీ అన్నదాతలకు వ్యవసాయశాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు ఈ-పంటలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల వివరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఆధార్ నెంబర్ తో సులభంగా స్టేటస్ ను తెలుసుకోవచ్చని సూచించింది.
ఈ-పంట స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?
- ముందుగా https://karshak.ap.gov.in/ecrop/farmerack లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ క్రాప్ ఇయర్, జిల్లాను ఎంచుకోవాలి.
- చివరగా రైతు ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే ఈ-పంట స్టేటస్ వివరాలు డిస్ ప్లే అవుతాయి.

రైతులు వ్యవసాయ సంబంధిత పథకాల రాయితీలు పొందాలన్నా.. ఉత్పత్తులు అమ్ముకోవాలన్నా ఈ-పంట నమోదు తప్పనిసరి. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. పంట విస్తీర్ణంతో పాటు ఖాతా, సర్వే నంబర్ల వారీగా ఈ-పంట యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియను చేపట్టారు. ఈ- పంట నమోదు ప్రక్రియలో అధికారుల క్షేత్రస్థాయి సందర్శన ఉంటుంది. సాగు చేస్తున్న పంటతో కలిపి రైతు ఫోటోను యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇది జియో-కోఆర్డినేట్స్‌తో అనుసంధానిస్తారు. చివరగా రైతు వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ ద్వారా వివరాలను ధ్రువీకరిస్తారు.
సాంకేతికతతో ఈ-పంట విధానం అమలవుతోంది. మరింత కచ్చిత వివరాల నమోదుకు కృత్రిమ మేధ (ఏఐ)తో సమాచారాన్ని నిర్ధారించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అన్ని జిల్లాలో సాగుకు సంబంధించి పంటల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసేస్తున్నారు.
ఈ-పంట నమోదుతో రైతులు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. పంటల వివరాలు ఆన్‌లైన్లో నమోదైతే ప్రకృతి వైపరీత్యాల సమయంలో పెట్టుబడి రాయితీ లభిస్తుంది. ఈ-పంట సర్టిఫికెట్ తో బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. ఎరువుల సరఫరాలో కూడా ఈ వివరాలను పరిగణనలోకి తీసుకోవచ్చు.