...
...
Next Story

AP Weather Alert : ఆంధ్రప్రదేశ్‌‌లో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Published on: Jun 27, 2026, 11:05:24 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతోపాటు వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ తీరం నుండి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారిపోతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు

వాతావరణ మార్పులపై ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. జూన్ 27 నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాబోయే రెండు రోజులు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పరిసర ప్రాంతాలు మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంటారని, దీనివల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని సూచించింది.

పొలాల్లో పనులు చేసుకునే రైతులు, పశువులను మేపే కాపరులు ఆకాశం నల్లగా మారి ఉరుములు వినిపించగానే వెంటనే సురక్షితమైన శాశ్వత భవనాల్లోకి వెళ్లాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రాణాంతకం కావచ్చు. వర్షం పడే సమయంలో రోడ్లు జారే ప్రమాదం ఉన్నందున వాహనదారులు వేగాన్ని నియంత్రించుకోవాలని, లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణించవద్దని అధికారులు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సహాయం తీసుకోవాలని తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe