AP Weather Update : ఏపీలో జులై 15 వరకు వడగాల్పుల హెచ్చరిక.. 44 శాతం తగ్గిన వర్షపాతం!
AP Weather Update : ఆంధ్రప్రదేశ్ వాతావరణం మారింది. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మరోవైపు వర్షాలు మెుహం చాటేశాయి. ఎల్ నినో ప్రభావం కనిపిస్తోంది.
వర్షాలు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో పగటి ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. ఇందులో ఎల్ నినో(El Nino) పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్థిక, గణాంక శాఖ వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు తిరుపతి జిల్లాలోని దొరవారిసత్రం ప్రాంతంలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.

సాయంత్రం 4 గంటల సమయానికి, పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో 40.9 డిగ్రీలు, ఒంగోలు సమీపంలోని త్రోవగుంట, తిరుపతి జిల్లాలోని బోనుపల్లిలో 40.8 డిగ్రీలు, అలాగే గుంటూరు జిల్లాలోని తెనాలిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 35 డిగ్రీలు నుండి 39 డిగ్రీలు మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. విజయవాడ, అమరావతిలో వరుసగా 38.9 డిగ్రీలు, 38.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అమరావతిలోని భారత వాతావరణ శాఖ సోమవారం నాడు బాపట్ల, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి వంటి జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. జూలై 15 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వడగాల్పులు, పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్థిక, గణాంక శాఖ ప్రకారం జూన్ 1 నుండి జూలై 12 మధ్య రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 154 మి.మీ. కాగా కేవలం 86.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దీనివల్ల మొత్తం 44 శాతం లోపం ఏర్పడింది. రాబోయే వారంలో వర్షాలు లేకపోవడం లేదా చాలా తక్కువగా కురవడం పరిస్థితి మరింత తీవ్రతరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని 28 జిల్లాల్లో 27 జిల్లాలు వర్షపాత లోపాన్ని నమోదు చేశాయి.
జులై 12 నాటికి సాధారణ వర్షపాతం నమోదైన అనంతపురం జిల్లా మినహా మిగిలిన జిల్లాలన్నీ వర్షాలు లేక అల్లాడుతున్నాయి. ముఖ్యంగా అన్నమయ్య, పశ్చిమ గోదావరి, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షపాత లోపం నమోదైంది. ఈ జిల్లాల్లో లోపం శాతం 61 శాతం నుండి 65 శాతం మధ్య ఉంది.
కోనసీమ జిల్లాలో నైరుతి రుతుపవనాల కాలంలో ఇప్పటివరకు, సాధారణ వర్షపాతం 201.9 మి.మీ కాగా కేవలం 77.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే పశ్చిమ గోదావరిలో సాధారణ వర్షపాతం 196.6 మి.మీ ఉండగా 68.7 మి.మీ, అన్నమయ్య జిల్లాలో సాధారణ వర్షపాతం 118.1 మి.మీ ఉండగా 48.1 మి.మీ వర్షపాతం నమోదయ్యాయి.
తిరుపతి, చిత్తూరు, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కూడా వర్షపాత లోటు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ లోటు శాతం 50 శాతం దాటింది. ఈ ఏడాది అత్యంత తీవ్రమైన ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


