AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీకి రెయిన్ అలర్ట్….
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ(జూలై 22) ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకుండా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలో వర్షాలు - హెచ్చరికలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులిటెన్ ప్రకారం…. తెలంగాణలో ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యా.యి. ఇక మిగిలిన జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
రేపట్నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు… ముఖ్యంగా ప్రయాణికులు, వాహనదారులు వాతావరణ హెచ్చరికలను గమనించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.