బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది.
3 రోజుల పాటు వర్షాలు.. ఉత్తరాంధ్రకు అలర్ట్

ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో వాతావరణం వేగంగా మారనుంది. ఉత్తరాంధ్రలోని ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని, ప్రజలు పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు హెచ్చరించారు.
తీరం వెంబడి ఈదురుగాలులు….
అల్పపీడన తీవ్రత కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లరాదనిఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా వేటకు వెళ్లేవారు ఈ హెచ్చరికలను కచ్చితంగా పాటించాలని కోరారు.
జూలై 3వ తేదీన (ఇవాళ) శ్రీకాకుళం, పోలవరం ప్రాంతం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని…. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.