Telangana Weather : తెలంగాణలో చల్లబడిన వాతావరణం - హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం, ఐఎండీ అంచనాలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న నగర ప్రజలకు ఈ వాన చల్లటి ఉపశమనాన్ని ఇచ్చింది.
భాగ్యనగర ప్రజలను గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఉక్కపోతకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి…. వర్షం కురిసింది. నగరంలోని ప్రధాన ఐటీ హబ్ అయిన గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బోరబండ, యూసుఫ్‌గూడ, ఎస్‌ఆర్ నగర్, సనత్‌నగర్ వంటి ప్రాంతాల్లో వాన జల్లులు పడ్డాయి. అదేవిధంగా నగర శివారు ప్రాంతాలైన హైదర్‌గూడ, ఉప్పరపల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్‌లలో కూడా వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షం కురిసింది.

గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు… మారిన వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. రోడ్లపై వెళ్లే వాహనదారులు, కార్యాలయాల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమైన ఉద్యోగులు తడిసి ముద్దయ్యారు. ఎండల తీవ్రత తగ్గి, చల్లటి గాలులు వీయడంతో నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
రోడ్లపై నీరు నిలవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. రాబోయే గంటల్లో నగరంలోని మరికొన్ని ప్రాంతాలకు వర్షం విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనూ వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి.
ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు….
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో అప్డేట్ అందించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు పసుపు రంగు (ఎల్లో) హెచ్చరికలను జారీ చేశారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ… రాబోయే నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా తగ్గుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇవాళ్టి నుంచి జూన్ 7వ తేదీ ఉదయం 08:30 గంటల వరకు తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
జూన్ 7వ తేదీ ఉదయం 08:30 గంటల నుంచి జూన్ 10వ తేదీ ఉదయం 08:30 గంటల వరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మూడు రోజుల్లోనూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. అదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని హెచ్చరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

