Andhra Pradesh Telangana Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం తీవ్రంగా కొనసాగుతోంది. ఇది మరింత బలపడి బుధవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న కొద్దిరోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన…

మంగళవారం (ఆగస్టు 11) ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడా ఇక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
వర్షాలు, ఉరుములు, ఈదురుగాలుల నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజలను అప్రమత్తం చేసింది. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించింది. ముఖ్యంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌ల కింద నిలబడకూడదని హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు లేదా పక్కా భవనాల్లోకి వెళ్లాలని స్పష్టం చేసింది.
తెలంగాణలో ఈదురుగాలులు….
మరోవైపు హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం (IMD) తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణ వ్యాప్తంగా వచ్చే కొద్దిరోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆగస్టు 13 తర్వాత వర్షాలు కొనసాగినప్పటికీ…. ఈదురుగాలుల తీవ్రత తగ్గే అవకాశం ఉంది.