పొత్తు ప్రకారమే స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పోలవరం జిల్లాలో అడవి తల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. గిరిజనులు తయారు చేసిన అటవీ ఉత్పత్తులు, మార్కెటింగ్ సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
అడవి తల్లిబాట 2.0 కార్యక్రమాన్ని పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వేములకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని రాకోట గిరిశిఖర గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అదే పంచాయతీ పరిధిలోని కాకవాడ, రాకోట, సువర్లవాడ, వేములకొండ గ్రామాలను కలిపేలా రూ. 2.29 కోట్ల వ్యయంతో 3.4 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం రాకోట గ్రామంలో చింతచెట్టు కింద ఉన్న రచ్చబండ వద్ద గిరిపుత్రులతో ‘మాటా-మంతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాకోట గ్రామ సందర్శన సందర్భంగా అక్కడి ఎంపీపీ పాఠశాల శిథిలావస్థలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి దాని పునరుద్ధరణకు రూ. 20 లక్షలు మంజూరు చేశారు. గ్రామస్థుల కోరిక మేరకు విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేశారు. రాకోట గ్రామస్థుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేకుల షెడ్డులో కొనసాగుతున్న ఆలయ పరిస్థితిని గమనించిన ఆయన, దేవాదాయ శాఖ సహకారంతో భజన మందిరంగా అభివృద్ధి చేసేందుకు మరో రూ. 20 లక్షలు కేటాయించారు.
‘మాటా-మంతి’ కార్యక్రమంలో రాకోట పరిసర ప్రాంతాలైన వేములకొండ, సువర్లవాడ, డబ్బావలస, తిరుగటిరాళ్లు, కాకవాడ, చిలకవీధి, వెట్టిచెలకలు, సోకులగూడెం తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయన తక్షణమే స్పందించారు. ప్రతి గ్రామానికి అంగన్‌వాడీ కేంద్రంతో కూడిన మండల పరిషత్ పాఠశాల, విలేజ్ హెల్త్ క్లినిక్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల ద్వారా దాదాపు రూ. 5 కోట్లు కేటాయించారు. గిరిజనులు తమ సమస్యలను స్వయంగా ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా.. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.
గిరిజన గ్రామాలు అన్నింటికీ రోడ్లు వేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యం అని పవన్ కల్యాణ్ వివరించారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో మరింత బలం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీ బతకాలని కాదని, వ్యవస్థ బతకాలనేది తన ఆలోచన అని చెప్పారు. పొత్తు ప్రకారం జనసేన శ్రేణులు ఎన్నికల్లో పోటీ చేస్తాయన్నారు.
పర్యటనలో భాగంగా రాకోట గ్రామంలో వెదురు బొంగులతో గృహోపకరణాలు తయారు చేస్తున్న కొమ్మిరెడ్డి కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సెర్ప్ ఆధ్వర్యంలో వెదురు ఉత్పత్తుల ప్రోత్సాహానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. వెదురు ఉత్పత్తులకు మరింత విలువ జోడించి, గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం లభించేలా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామన్నారు.
కాకవాడ గ్రామంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 పథకం కింద వాటర్‌షెడ్ అభివృద్ధి పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.68 కోట్ల వ్యయంతో 34 వేల మంది అర్హులైన రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించే కార్యక్రమంలో భాగంగా స్థానిక గిరిజన రైతులకు పరికరాలను పంపిణీ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


