...
...
Next Story

నవంబర్ 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం.. పౌర్ణమి గరుడ సేవ రద్దు!

Tirumala Temple : నవంబర్ 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా పౌర్ణమి గరుడ సేవ రద్దు చేశారు.

Published on: Nov 23, 2026, 05:55:34 IST
Advertisement

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు.

తిరుమల కార్తీక దిపోత్సవం
తిరుమల కార్తీక దిపోత్సవం

ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.

ప్రతి నెలా టీటీడీ పౌర్ణమినాడు నిర్వహించే గరుడ సేవను ఈ సందర్భంగా రద్దు చేసింది. అదే విధంగా కార్తీక దీపోత్సవం కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను కూడా ఆ రోజు రద్దైంది.

గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో న‌వంబరు 24న‌ కార్తీక దీపోత్సవం ఘ‌నంగా జరుగ‌నుంది. సాయంత్రం 6.30 గంట‌ల‌కు శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మవారి ఆల‌యం నుండి కార్తీక దీపం, వ‌స్త్రాల‌ను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి సమర్పిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించ‌నున్నారు.

టీటీడీ విజిలెన్స్ విభాగంలోని సెక్యూరిటీ / విజిలెన్స్ గార్డు పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి మాజీ సైనికులు, పౌరుల మధ్య అమలులో ఉన్న 1:2 నిష్పత్తిని రద్దు చేస్తూ టీటీడీ సాధికార మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నిష్పత్తిని మార్చి కొత్త విధానంలో నియామకాలు చేపట్టే అంశం కేవలం ప్రతిపాదన దశలోనే ఉందని, దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలియజేసింది.

గతంలో అమలులో ఉన్న నియామక విధానమే ప్రస్తుతం కూడా యథాతథంగా కొనసాగుతోందని, నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎలాంటి అపోహలకు తావివ్వకుండా, అసత్య ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks