...
...
Next Story

హాలో ఇండియా... ఏపీలో చట్టబద్ధ పాలన లేదు... అంతా 'రెడ్‌ బుక్' పాలనే - వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజకీయ ప్రత్యర్థులతో పాటు సామాన్య ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Published on: Jun 21, 2026, 06:55:52 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, చట్టబద్ధ పాలన స్థానంలో భీతావహ పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలు అత్యంత భయపడేది పోలీసులకేనా అనే దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న కస్టడీ మరణాలు, ఆత్మహత్యలపై శనివారం హాలో ఇండియా పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.

వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

గాదె సాయికృష్ణ కస్టడీ మరణం, ఆ తర్వాత అతని మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అలాగే పోలీసుల వేధింపుల తట్టుకోలేక క్రాంతి కుమార్‌ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఇలాంటి సంఘటనలు కేవలం యాదృచ్ఛిక విషాదాలు కావని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న “రెడ్‌బుక్ పాలన” పెంచి పోషించిన ప్రమాదకర సంస్కృతికి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలని ఆయన దుయ్యబట్టారు.

చంద్రబాబు 'రెడ్‌బుక్' రాజ్యాంగం

"ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారమా పనిచేస్తున్నారా? లేక చంద్రబాబు రెడ్‌బుక్ ప్రకారం నడుచుకుంటున్నారా…? అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు," అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో న్యాయం స్థానంలో భయం, చట్టపాలన స్థానంలో అధికార దుర్వినియోగమే నేడు పోలీసింగ్‌కు సరికొత్త నిర్వచనంగా మారిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడే తాము హెచ్చరించామని, రాజకీయ కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థను వాడుకుంటే వ్యవస్థలు పూర్తిగా కలుషితమవుతాయని తాము చెప్పిన మాటలు నేడు నిజమయ్యాయని గుర్తుచేశారు.

సాయికృష్ణ ఘటన ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిందన…. కనీసం తన కుమారుడి అస్థికలైనా తనకు అప్పగించాలని ఒక తల్లి అధికారులను వేడుకునే దుస్థితి రావడం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భయంకరమైన పరిస్థితి అని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రాంతికుమార్ లాగే తునిలో తిరుపతమ్మ, శ్రీకాకుళం జిల్లాలో కళావతి అనే మహిళలు పోలీసుల వేధింపుల వల్లే సెల్ఫీ వీడియోలు తీసి ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ విచారణ పేరుతో జరిగిన పోలీసు చిత్రహింసల కారణంగానే మరణించిందని, ఆమె మృతదేహాన్ని కూడా రహస్యంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు న్యాయ విచారణ కోరుతున్నారని తెలిపారు.

రాష్ట్రంలో కోడి కోశారన్నా, మేక కోశారన్నా.. చిన్న చిన్న ఆరోపణలకే ప్రతిపక్ష కార్యకర్తలను వీధుల్లో ఊరేగించి అవమానిస్తున్నారని జగన్ మండిపడ్డారు. కొందరు అధికారులు కోర్టులు, న్యాయమూర్తుల పాత్రలు తామే పోషిస్తూ మోరల్ పోలీసింగ్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు. మరోవైపు వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తే కేసులు కూడా నమోదు చేయడం లేదని, ఈ ద్వంద్వ వైఖరి పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని అన్నారు.

ఈ ఘోరమైన పరిస్థితులకు రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం పాలన కావాలి గానీ, ఇలాంటి రెడ్‌బుక్ పాలన కాదని స్పష్టం చేశారు. పోలీసులు రాజకీయ ప్రతీకారానికి పనిముట్లుగా మారకుండా…. ప్రజల హక్కులను కాపాడాలని హితవు పలికారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe