కర్నూలు బస్సు ప్రమాద ఘటన : మద్యం మత్తులో ఆ ఇద్దరు....! వెలుగులోకి మరికొన్ని కీలక విషయాలు

కర్నూల్ బస్సు దగ్ధం కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. బైక్ పై ప్రయాణించిన ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఉలిందికొండ పోలీస్ స్టేషన్‌లో బస్ డ్రైవర్ తో పాటు ట్రావెల్స్‌ యజమానిపై కేసు నమోదైంది.

Published on: Oct 26, 2025, 12:11:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్నూల్ జిల్లాలోని చిన్న టేకూరు వద్ద జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తుండగా… ప్రమాదానికి గల కారణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. బస్సును ఢీకొట్టిన బైక్ పై ఒక్కరు మాత్రమే లేరని… మరో వ్యక్తి కూడా ఉన్నాడని పోలీసులు ప్రకటించారు. వీరిద్దరూ కూడా మద్యం మత్తులో ఉన్నారని ధ్రువీకరించారు.

కర్నూల్ బస్సు ప్రమాదం
కర్నూల్ బస్సు ప్రమాదం

అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద స్లీపర్ బస్సును బైక్ ఢీకొట్టింది. బస్సులో 44 మంది ప్రయాణికులు ఉండగా.. 19 మంది సజీవ దహనమయ్యారు. చాలా మంది తప్పించుకోగలిగారు. ద్విచక్రవాహనం బస్సు కిందికి వెళ్లగా… కొంచెం దూరం అలాగే బస్సు ముందుకెళ్లింది. ఈ క్రమంలోనే ఇంజిన్ లో మంటలు చెలరేగటంతో ఘోర ప్రమాదం జరిగింది.

మద్యం మత్తులో ఆ ఇద్దరు..!

బైక్ పై ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు (శివ శంకర్, ఎర్రి స్వామి) తాగి ఉన్నట్లు ఫోరెన్సిక్ ధృవీకరణలో తేలిందని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ పీటీఐ వార్త సంస్థకు తెలిపారు. వీరిద్దరూ దాబాలో భోజనం చేశారని… స్వామి మద్యం సేవించినట్లు అంగీకరించారని వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శంకర్, స్వామి అక్టోబర్ 24 తెల్లవారుజామున 2 గంటల సమయంలో లక్ష్మీపురం గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై కర్నూలు జిల్లా తుగ్గలి గ్రామంలో దింపడానికి బయలుదేరారు. తెల్లవారుజామున 2.24 గంటలకు కియా కార్ షోరూమ్ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద వీరిద్దరూ ఆగారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

పెట్రోల్ బంక్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. ఫలితంగా శంకర్ తన కుడి వైపుకు పడి డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్వామి… శంకర్ ను రోడ్డు మధ్యలో నుంచి లాగి పక్కకు జరిపి చూడగా.. అక్కడికక్కడే మృతి చెందినట్లు గమనించాడని పాటిల్ తెలిపారు.

“అతను(స్వామి) బైక్ ను రహదారి నుంచి పక్కకు లాగాలని ఆలోచిస్తున్నప్పటికీ అప్పటికే బస్సు వేగంగా వచ్చేసింది. బైక్ ను కొంత దూరం ముందుకు లాగుకుపోయింది. వరుసగా రెండు ప్రమాదాలు జరగటంతో పాటు బస్సు మంటల్లో కాలిపోవటంతో స్వామి భయపడిపోయాడు. తన స్వగ్రామమైన తుగ్గలికి బయలుదేరాడు” అని జిల్లా ఎస్పీ వివరించారు.

పోలీసులు స్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో భయంకరమైన ప్రమాదానికి సంబంధించిన కీలక వివరాలు బయటికి వచ్చాయి.

మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ఉలిందికొండ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరిపై కేసు నమోదైంది. ఏ1గా వి కావేరి ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌, ఏ2గా వి కావేరి ట్రావెల్స్‌ యజమానిపై కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రయాణికుడు రమేష్‌ ఫిర్యాదుతో కేసు నమోదైంది. బీఎన్ ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More