ప్రతీ మద్యం బాటిల్‌కు ప్రత్యేక నెంబర్.. ఏపీలో పెరిగిన లిక్కర్ సేల్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ మద్యం బాటిల్‌కు ప్రత్యేక నెంబర్ కేటాయించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.
సచివాలయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, ప్రొహిబిషన్-ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్, ఎక్సైజ్ ఈడీ రాహుల్ దేవ్ శర్మ హాజరయ్యారు. కొత్త ఎక్సైజ్ విధానాల అమలు, వాటి ప్రభావంపై సమీక్షలో సమగ్రంగా చర్చించారు.

రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు ఉండకూడదని, మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిలానే పరిగణించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, ఇంకా... లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, రిటైలర్ మార్జిన్ పెంపు... తదితర అంశాలపై మరింత కసరత్తు చేయాలని సూచించారు.
బార్ ఏఆర్ఈటీ (అడిషనల్ రిటెయిల్ ఎక్సైజ్ టాక్స్) మినహాయింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. అక్రమ మద్యాన్ని అరికట్టడం, బెల్టు షాపుల నియంత్రణ, డిజిటలైజేషన్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
పెరిగిన మద్యం విక్రయాలు
అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు రూ.8,000 కోట్లు ఎక్సైజ్ ఆదాయం లక్ష్యం పెట్టుకోగా, రూ.7,041 కోట్లు ఆదాయం వచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మద్యం విక్రయాల్లో 4.52 శాతం పెరుగుదల కనిపించిందని... ఐఎంఎఫ్ఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) విక్రయాలు 19.08 శాతం, బీర్ విక్రయాలు 94.93 శాతం పెరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.8,422 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు అధికారులు తెలిపారు.
మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3 శాతం పెరుగుదల చూపిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. అంతర్జాతీయ బ్రాండ్‌లు తీసుకురావడం, నాణ్యమైన మద్యం అందుబాటు ధరకు అందివ్వడంతో ఐఎంఎఫ్ఎల్, బీర్ విక్రయాల్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే అత్యధిక వృద్ధి కనబరిచిందని అధికారులు వెల్లడించారు. అయితే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లో తలసరి మద్యం వినియోగం తక్కువ ఉందని... తెలంగాణలో తలసరి 4.74 లీటర్లు మద్యం వినియోగిస్తుంటే, ఏపీలో తలసరి వినియోగం 2.77 లీటర్లుగా ఉందన్నారు.
35 శాతం డిజిటల్ చెల్లింపులు
మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులు 34.9 శాతం పెరిగాయని, కొన్ని జిల్లాల్లో 40–47 శాతం వరకు డిజిటల్ లావాదేవీలు నమోదైనట్టు వివరించారు. అయితే నగదు వినియోగాన్ని తగ్గించి... డిజిటల్ చెల్లింపులు జరిగేలా అందరిలో అవగాహన పెంచాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం, అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రతి మద్యం బాటిల్‌కు ప్రత్యేక లిన్ (లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్) త్వరితగతిన తీసుకురావాలని, సాధారణ ప్రజలు కూడా సులభంగా గుర్తించేలా ఉండాలన్నారు.
లిన్‌లో బ్రాండ్, బ్యాచ్, లైన్‌తో పాటు తయారైన తేదీ, గంటలు, నిమిషాలు, సెకన్లు సహా వివరాలు ఉండాలన్నారు చంద్రబాబు. లిన్‌తో ప్రస్తుతం అనుసరిస్తున్న హీల్ (Hologram Excise Adhesive Labels) లోపాలను సరిచేయొచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే జియో-ట్యాగింగ్ ద్వారా మద్యం సరఫరాలో పూర్తి పారదర్శకత వస్తుందని... ట్రాకింగ్, షాపుల రేషనలైజేషన్‌పైనా దృష్టి పెట్టాలని సీఎం అన్నారు.
బెల్టుషాపులపై కఠిన చర్యలు
అనధికార విక్రయ కేంద్రాలుగా తయారైన బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బెల్టు షాపులు పూర్తిస్థాయిలో కట్టడి చేయడానికి హర్యానాలో అనుసరించిన సబ్ లీజు విధానాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం గ్రామీణ, దూర ప్రాంతాల్లో షాపులు లేకపోవడం వల్ల బెల్ట్ షాపుల సమస్య నెలకొందని అధికారులు చెప్పారు. అలాగే, పర్యావరణ పరిరక్షణలో భాగంగా... మద్యం వినియోగం అనంతరం బాటిల్ తిరిగి ఇస్తే డీఆర్ఎస్ (డిపాజిట్ రిటర్న్ స్కీమ్) కింద నగదు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


