AP Handicrafts : డిప్యూటీ సీఎం పవన్ చొరవ... హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా, ప్రత్యేక వైద్య శిబిరాలు

Andhra Pradesh Handicrafts : ఏపీ హస్తకళా మహోత్సవంలో ఇచ్చిన మాటను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 24 గంటల్లోనే నిలబెట్టుకున్నారు. నరసాపురం, శ్రీకాళహస్తి కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ప్రారంభమయ్యాయి.

Published on: Jul 9, 2026, 16:22:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Andhra Pradesh Handicrafts : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన మాటను 24 గంటలు గడవక ముందే ఆచరణలో పెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్ర హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు హస్త కళాకారుల ఆరోగ్యానికి పూర్తి భరోసా కల్పించేలా క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ చొరవతో బుధవారం నుంచే క్షేత్రస్థాయిలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటయ్యాయి.

హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు
హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు

ప్రత్యేక వైద్య శిబిరాలు….

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లేస్ కళాకారులు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం మొదటి విడతగా ఈ ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించారు. నరసాపురంలో నిర్వహించిన శిబిరంలో మొత్తం 105 మంది లేస్ కళాకారులకు నిపుణులైన వైద్యులు పరీక్షలు చేశారు. వీరిలో 37 మంది వివిధ రకాల కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ 37 మందిలో 16 మందికి కళ్లలో శుక్లాలు (క్యాటరాక్ట్) ఉన్నట్లు గుర్తించారు.

వీరందరికీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే చిన్నపాటి దృష్టి దోష సమస్యలతో ఇబ్బంది పడుతున్న మిగిలిన 21 మంది కళాకారులకు తగిన కళ్లజోళ్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

మరోవైపు ఆధ్యాత్మిక పట్టణమైన శ్రీకాళహస్తిలో 53 మంది కలంకారీ హస్తకళాకారులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలతో పాటు జనరల్ చెకప్, బీపీ, షుగర్ వంటి అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను ఈ శిబిరంలో ఉచితంగా చేశారు.

మంగళవారం జరిగిన హస్తకళా మహోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గం పసలదీవి గ్రామానికి చెందిన లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తనకున్న కంటి సమస్యల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. చీకటి పడితే కళ్లు సరిగ్గా కనిపించడం లేదని ఆమె తన బాధను వివరించారు.

దీనిపై తక్షణమే స్పందించిన పవన్ కళ్యాణ్….. బుధవారం ఉదయమే మహాలక్ష్మితో పాటు అందే లక్ష్మి అనే మరో లేస్ కళాకారిణిని ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని ప్రసిద్ధ శంకర కంటి ఆసుపత్రికి పంపించారు. అక్కడ నిపుణులైన వైద్యులు వీరిద్దరికీ అత్యాధునిక పరికరాలతో కూడిన ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు.

ఇరువురికీ దృష్టి దోష సమస్యలు ఉన్నట్లు నిర్ధారించిన వైద్యులు, వారికి అవసరమైన కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్, మందులను ఉచితంగా అందజేసి సురక్షితంగా ఇంటికి పంపించారు. తమ సమస్యపై స్పందించి 24 గంటల్లోనే వైద్యం చేయించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కళాకారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More