Visakhapatnam Earthquake : విశాఖపట్నం నగర ప్రజలు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం సుమారు 5:08 గంటల సమయంలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గాఢ నిద్రలో ఉన్న పలువురు స్థానికులు ఒక్కసారిగా ఇళ్లలోని వస్తువులు కదలడంతో కంగారుగా రోడ్లపైకి పరుగులు తీశారు. తీరప్రాంత పరిసరాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కాస్త స్పష్టంగా కనిపించింది.
బంగాళాఖాతంలో భూకంప కేంద్రం
ఈ ప్రకంపనలకు సంబంధించి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) కీలక నివేదికను విడుదల చేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5 గా నమోదైనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాకినాడ తీరానికి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో, సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సముద్ర గర్భంలో వచ్చిన మార్పుల వల్లే తీరప్రాంత జిల్లాల్లో ఈ ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
ఆందోళన అవసరం లేదు: అధికారులు
భూప్రకంపనల వార్తతో తీరప్రాంత జనాలు ఆందోళన చెందినప్పటికీ, అధికారులు ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు. బంగాళాఖాతం లోపల భూకంపం వచ్చినప్పటికీ దీని వల్ల ఎలాంటి ప్రమాదం గానీ, ఆస్తి, ప్రాణ నష్టం గానీ వాటిల్లలేదని స్పష్టం చేశారు. సునామీ లాంటి ముప్పులు వచ్చే అవకాశం లేదని ప్రాథమిక అంచనాలో తేలింది. అయినప్పటికీ తీరప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని… తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.