తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన వివరాల ప్రకారం….. ద్రోణి ప్రభావంతో సోమవారం (19-10-2026) రోజున పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ వెదర్ రిపోర్ట్….
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలో రాగల కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
- అక్టోబర్ 19 - 20 : జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
- అక్టోబర్ 21 - 22: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.
- అక్టోబర్ 22 ఉదయం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎలాంటి తీవ్ర వాతావరణ హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.