...
...
Next Story

ముద్ఖేడ్-మేడ్చల్-మహబూబ్‌నగర్-డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్.. భూసేకరణ వేగవంతం

ఆంధ్రప్రదేశ్ పరిధిలో ముద్ఖేడ్-మేడ్చల్-మహబూబ్‌నగర్-డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, ప్రభుత్వ భూముల బదిలీని వేగవంతం చేసింది. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు.

Published on: May 28, 2026 10:11 AM IST
Advertisement

ముద్ఖేడ్-మేడ్చల్-మహబూబ్‌నగర్-డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూముల బదిలీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా సాగుతున్న కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, జాతీయ పథకాల అమలుపై ప్రధాని మోదీ న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన 'ప్రగతి' (PRAGATI) వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సాయి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిని ఆయన ప్రధానమంత్రికి నివేదించారు.

డోన్-మహబూబ్‌నగర్ రైల్వే ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 23.07 హెక్టార్ల ప్రైవేట్ భూమి అవసరమని సీఎస్ తెలిపారు. దీనికి సంబంధించిన సెక్షన్ 20(A) నోటిఫికేషన్‌ను 2025 సెప్టెంబర్ 25న జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు కోసం కర్నూలు జిల్లాలోని నాలుగు మండలాల్లోని 16 గ్రామాల్లో దాదాపు 18.21 హెక్టార్ల భూమి అవసరం కానుంది. రైల్వే అధికారుల సహకారంతో ఇప్పటికే 8 గ్రామాల్లో పెగ్ మార్కింగ్ పూర్తయిందని, మిగిలిన గ్రామాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎస్ చెప్పారు. మరో రెండు వారాల్లో సెక్షన్ 20(E) నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. నంద్యాల జిల్లాలో అవసరమైన 4.86 హెక్టార్ల భూమికి సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తయిందని, సెక్షన్ 20(E) నోటిఫికేషన్‌ను కూడా ఇప్పటికే జారీ చేసినట్లు వివరించారు.

ఈ ప్రాజెక్ట్ కోసం 4.05 హెక్టార్ల ప్రభుత్వ భూమిని బదిలీ చేయాల్సి ఉందని సీఎస్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. రైల్వే అధికారుల నుంచి అధికారిక అభ్యర్థనలు అందిన వెంటనే జిల్లా కలెక్టర్లు ముందస్తుగా భూమిని స్వాధీనం చేస్తారని సీఎస్ స్పష్టం చేశారు.

ఈ వర్చువల్ సమావేశంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి డాక్టర్ టి.వి.సోమనాథన్, రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓ సతీష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు న్యూఢిల్లీ నుంచి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున రవాణా, రహదారులు, భవనాలు, రెవెన్యూ, పురపాలక పరిపాలన శాఖల సీనియర్ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe