ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి భక్తులకు దేవాదాయ శాఖ తీపి కబురు అందించింది. కొండపై నూతనంగా అత్యాధునిక వసతులతో నిర్మించిన అన్నదానం భవన్, ప్రసాదాల తయారీ కేంద్రం (పోటు) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రాబోయే జూలై 15వ తేదీ లోపు ఈ భవనాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు.

దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ ఇంద్రకీలాద్రిపై సుడిగాలి పర్యటన చేశారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. దుర్గగుడి ఈవో, ఇంజనీరింగ్ అధికారులు, పాలకమండలి సభ్యులతో కలిసి కమిషనర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుండి ప్రతిరోజూ వేలాది మంది, ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారి కనీస అవసరాలైన అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నూతన కేంద్రాన్ని డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న అన్నదానం హాల్‌లో భక్తుల రద్దీ దృష్ట్యా, మరింత విశాలమైన, పరిశుభ్రమైన వాతావరణంలో భక్తులకు భోజన సదుపాయం కల్పించేందుకు ఈ నూతన భవనాన్ని నిర్మించారు. అలాగే అమ్మవారి లడ్డూ ప్రసాదాలు, ఇతర ప్రసాదాలను అత్యంత పరిశుభ్రమైన(హైజీనిక్) పద్ధతిలో, అత్యాధునిక యంత్రాల సాయంతో తయారు చేసేందుకు వీలుగా కొత్త ప్రసాదాల తయారీ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. దీనివల్ల ప్రసాదాల నాణ్యత పెరగడమే కాకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేసే అవకాశం ఉంటుంది.
జూలై 15లోపు ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే, రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నాటికి భక్తులకు అన్నదానం, ప్రసాదాల పంపిణీ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
{{/usCountry}}జూలై 15లోపు ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే, రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నాటికి భక్తులకు అన్నదానం, ప్రసాదాల పంపిణీ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
{{/usCountry}}