గంగా దసరా 2026: మే 25నా? 26నా? పుణ్యస్నానాలకు ముహూర్తం ఎప్పుడు?
గంగా దసరా 2026: గంగా దేవి భూమిపైకి అవతరించిన పవిత్రమైన రోజే గంగా దసరా. ఈ ఏడాది మే 25, 26 తేదీల మధ్య తేదీ విషయంలో తలెత్తిన అయోమయానికి పండితులు ఏమంటున్నారో, స్నాన దానాలకు సరైన సమయం ఏదో ఇక్కడ తెలుసుకోండి.
హిందూ ధర్మంలో గంగానది కేవలం ఒక నది మాత్రమే కాదు.. అది కోట్లాది మంది విశ్వాసం, మోక్షానికి మార్గం. జ్యేష్ఠ శుక్ల పక్ష దశమి తిథి నాడు గంగా దసరా పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఈ పవిత్రమైన రోజున గంగా మాత భూమిపైకి అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హస్త నక్షత్రంలో గంగమ్మ భూమిని తాకినట్లు ప్రతీతి. ఈ పర్వదినం వేళ నదిలో పుణ్యస్నానం ఆచరిస్తే పది రకాల పాపాలు తొలగిపోయి, అక్షయ పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

అయితే, 2026 సంవత్సరంలో గంగా దసరా ఏ రోజున జరుపుకోవాలనే విషయంలో సామాన్యుల్లో కొంత అయోమయం నెలకొంది. కొన్ని పంచాంగాల ప్రకారం మే 25 అని, మరికొన్నింటిలో మే 26 అని ఉండటమే ఇందుకు కారణం.
జ్యోతిష్య పండితులు ఏమంటున్నారు?
వారణాసి పంచాంగ గణాంకాల ప్రకారం, గంగా దసరా పండుగను 2026 మే 26, మంగళవారం నాడు జరుపుకోవడం ఉత్తమమని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ వివరించారు. ఈ రోజున సూర్యోదయం ఉదయం 5:18 గంటలకు ఉంటుంది. దశమి తిథి మే 26 ఉదయం 7:40 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది.
నక్షత్రాల గమనాన్ని గమనిస్తే.. మే 26 ఉదయం 6:55 గంటల వరకు ఉత్తర ఫాల్గుణి నక్షత్రం ఉంటుంది, ఆ వెంటనే గంగమ్మ అవతరించిన 'హస్త నక్షత్రం' ప్రవేశిస్తుంది. గంగావతరణం జరిగిన హస్త నక్షత్రం మే 26నే వస్తోంది కాబట్టి, ఆ రోజే స్నాన, దానాలకు అత్యంత శుభప్రదమని పండితులు స్పష్టం చేస్తున్నారు.
ఈ 10 రకాల పాపాలు నశిస్తాయి
గంగా దసరాను 'దశహర' అని కూడా పిలుస్తారు. అంటే పది రకాల పాపాలను హరించేది అని అర్థం. బ్రహ్మ పురాణం ప్రకారం, హస్త నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ శుక్ల దశమి నాడు గంగా స్నానం చేస్తే కింది పది రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది:
అనుమతి లేకుండా ఇతరుల వస్తువులను తీసుకోవడం
హింస చేయడం
పరస్త్రీ వ్యామోహం
కఠినంగా మాట్లాడటం
అసత్యం పలకడం
ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం లేదా చాడీలు చెప్పడం
అసందర్భ ప్రేలాపనలు
అన్యాయంగా ఇతరుల సొత్తును ఆశించడం
ఇతరులకు హాని తలపెట్టడం
నాస్తిక బుద్ధితో దైవ నింద చేయడం
స్నాన, దానాల శుభ ముహూర్తం
"గంగా దసరా రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది," అని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
బ్రహ్మ ముహూర్తం: మే 26 తెల్లవారుజామున 04:03 నుండి 04:44 వరకు.
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:46 వరకు.
ఇంట్లో పూజ ఎలా చేయాలి?
ఒకవేళ గంగా నదికి వెళ్లడం వీలుకాకపోతే, ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని స్నానం చేయవచ్చు. స్నానం చేసేటప్పుడు గంగమ్మను ధ్యానిస్తూ 'ఓం నమశ్శివాయ నారాయణ్యై దశహరాయై గంగాయై నమః' అనే మంత్రాన్ని జపించాలి. స్నానం అనంతరం పది ముత్తైదువులకు లేదా పది మంది బ్రాహ్మణులకు పది రకాల వస్తువులను, ధాన్యాలను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున సత్తు పిండి, పండ్లను దానం చేయడం ఆచారంగా వస్తోంది. గంగా దసరా కథను చదువుకుని లేదా విని ఉపవాసాన్ని విరమించడం ఉత్తమ పద్ధతి.
గమనిక: ఈ కథనంలోని అంశాలు పండితులు, ధర్మశాస్త్రాల ఆధారంగా అందించాం. వీటిని పాటించే ముందు మీ ప్రాంతీయ పంచాంగాన్ని లేదా నిపుణులను సంప్రదించగలరు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


