మెగా డీఎస్సీలో భారీ కుంభకోణం - సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్
ఏపీలో మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న మీడియా, ప్రతిపక్షాల సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తున్నారని మండిపడ్డారు.
మెగా డీఎస్సీ ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడిందని…. ఈ స్కామ్‌పై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) చేత స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నియామకాల్లో జరుగుతున్న అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం 'డిజిటల్ సెన్సార్‌షిప్'కు పాల్పడుతోందని ఆరోపించారు.

"డీఎస్సీ 2025 నియామకాల కుంభకోణం రోజురోజుకు బట్టబయలవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజూ కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తూ తీవ్రమైన అక్రమాలను బహిర్గతం చేస్తున్నాయి. దీనిపై చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సమాధానం చెప్పాలి," అని జగన్ నిలదీశారు. వాస్తవాలను వెలికితీసేందుకు సీబీఐ విచారణకు అంగీకరించాల్సింది పోయి, ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. "లీగల్ రిక్వైర్‌మెంట్స్ (చట్టపరమైన అవసరాలు)" పేరుతో మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) ప్లాట్‌ఫారమ్‌లలో ప్రతిపక్షాలు, మీడియా ఖాతాలపై నిబంధనలు విధిస్తూ, కంటెంట్‌ను తొలగించడం లేదా జియో-బ్లాకింగ్ చేయడం దారుణమని ధ్వజమెత్తారు.
"ఈ అణచివేత కేవలం డీఎస్సీ కుంభకోణంతోనే ఆగిపోలేదు. కూటమి ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, సూపర్ సిక్స్ మరియు సూపర్ సెవెన్ ఎన్నికల హామీల అమల్లో దగా, ప్రభుత్వ పెద్దల అహంకారం, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తున్నారు. మీ వద్ద ప్రశ్నలకు సమాధానాలు లేనప్పుడు, ప్రశ్నించే వారి నోళ్లు మూయిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సుపరిపాలన అనిపించుకోదు, పక్కా సెన్సార్‌షిప్ అవుతుంది. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. రాజకీయం గా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగినంత మాత్రాన ప్రతిపక్షాలను, మీడియాను, పౌరులను నోరెత్తకుండా చేసే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు" అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
విచారణకు భయమెందుకు..?
"చంద్రబాబు గారు.. మిమ్మల్ని భయపెడుతున్నది ఏంటి? అడుగుతున్న ప్రశ్నలా లేక రాబోయే సమాధానాలా? డీఎస్సీ నియామకాలపై ప్రతిరోజూ బయటపడుతున్న ఆధారాలు తప్పయితే, ప్రజల ముందుకు వచ్చి ఆధారాలతో సహా వాటిని తప్పు అని నిరూపించవచ్చు కదా! సీబీఐ విచారణకు ఎందుకు నిరాకరిస్తున్నారు? అక్రమాలను బయటపెడుతున్న వారిని ఎందుకు భయపెడుతున్నారు? ఖాతాలను ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? ఒక పోస్టును డిలీట్ చేసినంత మాత్రాన ఆధారాలు చెరిగిపోవు, ఒక అకౌంట్‌ను బ్లాక్ చేసినంత మాత్రాన సత్యాన్ని సమాధి చేయలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి, ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి, రాజ్యాంగబద్ధంగా పాలన సాగించండి," అని చురకలు వేశారు.
డీఎస్సీ నియామకాల్లో జరిగిన లోపాలను ఎత్తిచూపుతూ.. "పరీక్షలు రాయకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? టెట్ (TET) అర్హత సాధించని వారికి కూడా టీచర్ పోస్టులు కట్టబెట్టడం ఏ రకమైన న్యాయం? స్పోర్ట్స్ కోటా జీవోలు ఇవ్వడం, నియామకాలు పూర్తయ్యాక ఆ జీవోలను రద్దు చేయడం, అయినా ఆ జీవోల కింద ఎంపికైన వారు ఉద్యోగాల్లో కొనసాగడం చూస్తుంటే ఈ నియామకాల ప్రక్రియ అంతా అవినీతిమయంగా మారిందని స్పష్టమవుతోంది," అని దుయ్యబట్టారు.
ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. "సెన్సార్‌షిప్ ద్వారా నిలిపివేసిన ప్రతి సోషల్ మీడియా అకౌంట్‌ను, తొలగించిన ప్రతి పోస్టును వెంటనే పునరుద్ధరించాలి. డీఎస్సీ 2025 నియామకాలు పారదర్శకంగా జరిగాయని భావిస్తే, ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి. మీ వద్ద దాచడానికి ఏమీ లేకపోతే ఈ భయం ఎందుకు?" అని జగన్ సవాల్ విసిరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

