AP Local Body Elections 2026 : స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు - సెప్టెంబరులో నోటిఫికేషన్..!

AP Local Body Elections 2026 : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసి…. డిసెంబరు నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Published on: May 13, 2026, 11:17:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Local Body Elections 2026 : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అడుగు పడింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. డిసెంబరు నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) భావిస్తోంది. దీనివల్ల వచ్చే కొత్త సంవత్సరం (2027) నాటికి గ్రామ పంచాయతీలు, పురపాలికల్లో నూతన పాలకవర్గాలు కొలువు తీరనున్నాయి.

ఏపీలో స్థానిక ఎన్నికలు....!
ఏపీలో స్థానిక ఎన్నికలు....!

ఎస్‌ఈసీ కీలక సమీక్ష….!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని శాఖలు సహకరించాలని ఎస్‌ఈసీ కోరారు.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ వచ్చే నెలలో ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించనుంది. జూలై నెలలో రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఓటర్ల జాబితాల ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి కీలక ప్రక్రియలను పూర్తి చేసి సెప్టెంబరులో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

  • గ్రామ పంచాయతీలు : రాష్ట్రవ్యాప్తంగా 13,291 పంచాయతీల్లో ఇప్పటికే ఓటర్ల జాబితాల ప్రచురణ పూర్తయింది. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 56 పంచాయతీల్లో ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికల కోసం సుమారు 1.36 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
  • పురపాలికలు : మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ప్రక్రియ వచ్చే నెల 26 నాటికి పూర్తి కానుంది. మొదటిసారిగా జనాభా ప్రాతిపదికన డివిజన్ల విభజన చేపడుతున్నందున ప్రభుత్వం కొంత సమయం కోరింది. ప్రస్తుతం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ పునర్విభజన పనులు కొనసాగుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వస్తున్న ఈ స్థానిక పోరు అటు అధికార కూటమికి, ఇటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది. పల్లెల్లో తమ పట్టు నిరూపించుకునేందుకు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా మెజారిటీ పంచాయతీలను కైవసం చేసుకోవాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు, ఓటమి నుంచి కోలుకుని తిరిగి పుంజుకోవాలని వైసీపీ భావిస్తోంది. క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఈ ఎన్నికలను ఒక అవకాశంగా మలచుకోవాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారు.

స్థానిక సంస్థలకు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఎంతో కీలకం.

ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక చోట్ల ప్రత్యేక అధికారుల పాలన సాగుతుండటంతో…. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేక స్థానిక సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే ఏపీ సర్కార్ భావిస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More