...
...
Next Story

Tirumala Rush : తిరుమ‌ల‌లో భారీగా పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ - కిక్కిరిసిపోయిన క్యూలైన్లు

Tirumala Summer Rush 2026 : వేసవి సెలవుల రద్దీతో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఎండల తీవ్రత దృష్ట్యా శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

Published on: May 21, 2026, 21:50:10 IST
Advertisement

Tirumala Summer Rush 2026 : వేసవి కాలం సెలవులు కావడంతో కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రానికి భక్తుల రాక పోటెత్తింది. శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి తరలివస్తున్న యాత్రికుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమలలో గురువారం నాడు ఊహించని విధంగా భక్తుల రద్దీ నెలకొంది. కొండపైకి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లను రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ

ముఖ్యంగా భానుడి భగభగలకు భక్తులు అల్లాడిపోకుండా ఉపశమనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు సుదీర్ఘమైన చలువ పందిళ్లను నిర్మించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాలలో ఎండ తగలకుండా భారీ షెల్టర్లను అందుబాటులోకి తెచ్చారు.

భక్తుల రాకపోకలు అధికంగా ఉండే శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డూ కౌంటర్ల వద్ద తాత్కాలిక షెల్టర్లను నిర్మించారు. శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులు పట్టుపాదాలతో నడిచేటప్పుడు నేల వేడి తగలకుండా సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేశారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ఏర్పడిన క్యూలైన్లలో తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యాన్ని, అత్యవసర వైద్యం కోసం మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తుల ఆకలి తీర్చేందుకు టీటీడీ అన్నప్రసాద విభాగం సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తోంది. శ్రీవారి సేవకుల సహాయంతో భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మొబైల్ వాటర్ డ్రమ్ముల ద్వారా భక్తుల చెంతకే వెళ్లి తాగునీరు పంపిణీ చేస్తున్నారు. అన్నప్రసాదాల విషయానికొస్తే:

  • ఉదయం అల్పాహారం: పాలు, ఉప్మా, పొంగల్ అందిస్తున్నారు.
  • మధ్యాహ్న భోజనం: రుచికరమైన సాంబారన్నం, పులిహోర, టమోటా రైస్ వితరణ జరుగుతోంది.
  • రాత్రి సమయం: పాలు, ఉప్మా మరియు సాంబారన్నం నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు.

గదులు దొరకని భక్తుల కోసం పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ-4 (పద్మనాభ నిలయం), పీఏసీ-5లలో దాదాపు 9 వేల లాకర్లను కేటాయించారు. ప్రస్తుతం ఈ సముదాయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలాగే స్వామివారికి తలనీలాలు సమర్పించే కల్యాణకట్టల వద్ద రద్దీ పెరిగినందున, ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టలను అందుబాటులోకి తెచ్చి క్షురకుల ద్వారా నిరంతర సేవలు అందిస్తున్నారు.

శ్రీవారి దర్శనం - గణాంకాలు ఇలా:

గత ఐదు రోజుల్లో నమోదైన శ్రీవారి భక్తుల రద్దీ గణాంకాలు పరిశీలిస్తే భక్తుల రాక ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత 5 రోజుల్లోనే ఏకంగా 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మే 16, 17 తేదీల్లో అత్యధికంగా 90 వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే మే 18, 19, 20 తేదీల్లో ప్రతిరోజూ 43 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. గత ఐదు రోజుల్లో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 19 లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ అందించడం విశేషం.

వేసవి తీవ్రత ఎంత ఉన్నప్పటికీ భక్తులకు నీడ, చల్లని వాతావరణం, తాగునీరు, అన్నప్రసాదాలు, పరిశుభ్రత, లడ్డూల పంపిణీలో ఎలాంటి లోటు రాకుండా టీటీడీ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks