త్వరలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండగా… మరోవైపు ఈసీ కూడా ఏర్పాట్లు చేసే పనిలో పడింది. అయితే ఈ ఎన్నికలను ఇప్పట్నుంచే అత్యంత సీరియస్ గా తీసుకొని క్షేత్రస్థాయిలో పని చేయాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్…. పార్టీ నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనడానికి బలమైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జగన్ వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని…. అంగుళం మేర కూడా రాజీ పడకుండా పోరాడాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు.
పార్టీ ముఖ్య నేతల స్థాయి నుంచి నియోజకవర్గాల ఇన్‌చార్జుల వరకు మంగళవారం నిర్వహించిన కీలక సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… "ఇక్కడ మనం చూపే ఓర్పు, చూపే పట్టుదలే భవిష్యత్తులో సాధించబోయే భారీ విజయానికి బాటలు వేస్తుంది," అని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ ఎంతో తీవ్రంగా పరిగణిస్తుందని తేల్చిచెప్పారు.
ప్రభుత్వంపై అన్నివర్గాల్లో ఆగ్రహం - వైఎస్ జగన్
కూటమి పాలనపై సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, ఈ ప్రజావ్యతిరేకత రాబోయే ఎన్నికల్లో ఓట్లుగా మారి వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన విజయాన్ని అందిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న అక్రమ మార్గాలను, వైఫల్యాలను గట్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. గత రెండేళ్ల కూటమి పాలన అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగితే వైఎస్సార్‌సీపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని, టీడీపీ ఏ విధమైన అవకతవకలకు పాల్పడకుండా ప్రతి సీటులోనూ గట్టి పోటీ ఉండేలా చూడాలని నేతలను ఆదేశించారు.
ఏకగ్రీవాలకు తావు ఇవ్వొద్దు …
రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆశావాహులు తీవ్రంగా శ్రమించి తమ అభ్యర్థుల గెలుపును ఖాయం చేయాలని జగన్ సూచించారు. "స్థానిక పోరులో గెలిచే అవకాశం ఉన్న బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలి. ఎక్కడా ఏకగ్రీవాలకు తావు ఇవ్వకూడదు. పోటీ లేకుండా గెలిచేందుకు టీడీపీ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.
{{/usCountry}}రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆశావాహులు తీవ్రంగా శ్రమించి తమ అభ్యర్థుల గెలుపును ఖాయం చేయాలని జగన్ సూచించారు. "స్థానిక పోరులో గెలిచే అవకాశం ఉన్న బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలి. ఎక్కడా ఏకగ్రీవాలకు తావు ఇవ్వకూడదు. పోటీ లేకుండా గెలిచేందుకు టీడీపీ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.
{{/usCountry}}ప్రతి ఇంటినీ సందర్శించి ప్రజలతో మమేకం కావాలని నాయకులకు ఆయన నిర్దేశించారు. మాట తప్పే టీడీపీ వైఖరికి, వైఎస్సార్‌సీపీ ప్రజా సంక్షేమానికి మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రజల తరఫున నిలబడి వారి గొంతుకగా మారాలని పిలుపునిచ్చారు. పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు గ్రామీణ స్థాయి వరకు క్యూఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను… ఎన్నికల ప్రచార సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గం, జిల్లా, మండలం మరియు డివిజన్ స్థాయిలలో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలు, వేధింపులు, బెదిరింపు చర్యలను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు పార్టీ లీగల్ సెల్ నిరంతరం క్రియాశీలకంగా వ్యవహరించాలని జగన్ కోరారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా, సోషల్ మీడియా విభాగాలను మరింత వేగవంతం చేయాలన్నారు. కొత్తగా రూపొందించిన 'జగన్ 2.0' యాప్‌ను ఎలా ఉపయోగించాలో ప్రతి ఒక్కరికీ శిక్షణ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు.
"సోషల్ మీడియాను ఉపయోగించడంలో వెనుకబడిన నాయకులు వెంటనే ఆ సాంకేతికతను నేర్చుకోవాలి. ఇందులో ఎలాంటి అలసత్వానికి తావులేదు," అని స్పష్టం చేశారు. నాయకులు స్వార్థం, అహంభావాలకు తావివ్వకుండా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని హెచ్చరించారు. రాబోయే రెండు నెలలు నాయకులంతా తమ తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ పార్టీ కోసం నిరంతరం శ్రమించాలని, ఇది అత్యంత కీలకమైన సమయమని స్పష్టం చేశారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం తప్పుగా వాడుకుంటోందని జగన్ తీవ్రంగా విమర్శించారు. చట్టపరిధి దాటి ప్రవర్తించే అధికారుల పేర్లను 'డిజిటల్ బుక్'లో నమోదు చేస్తామని, భవిష్యత్తులో అలాంటి వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు.