ముంచెత్తిన మురసు... 30 వేలకుపైగా హెక్టార్లలో పంట నష్టం.. ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం!

Cyclone Murasu Damage : మురసు తీవ్ర తుపాను కారణంగా 15 జిల్లాల్లో 30,000 హెక్టార్లకు పైగా నిలబడి ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. ఈ తుపాను ప్రధానంగా కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాలను ప్రభావితం చేసింది.

Published on: Nov 3, 2026, 15:36:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తీవ్ర తుపాను మురసు(Murasu Severe Cyclonic Storm) ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో విరుచుకుపడటంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలోని 15 జిల్లాల్లో సుమారు 30,661 హెక్టార్లలో నిలబడి ఉన్న పంటలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

మురసు తుపాను నష్టం
మురసు తుపాను నష్టం

మురసు తుపాను ధాటికి ముఖ్యంగా కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వర్షపు నీరు పొలాల్లో చేరడంతో చేతికి వచ్చిన పంటలు పాడైపోయాయి. ముఖ్యంగా దెబ్బతిన్న పంటలు చూసుకుటే.. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు అత్యధికంగా నష్టం వాటిల్లింది.

వర్షపు నీరు పొలాల్లో నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం అంచనాను త్వరలోనే పూర్తి చేసి బాధితులకు పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర తుపాను 15 జిల్లాల్లోని 132 మండలాలపై అసాధారణ ప్రభావాన్ని చూపింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో అధికారులు త్వరితగతిన స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల నుండి 10,805 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, తుపాను షెల్టర్లకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం 171 బియ్యం/ఆహార పరిమితి శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు ఇప్పటివరకు 14,810 ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో పునరుద్ధరణ కోసం 613 జనరేటర్లను సిద్ధం చేసి వినియోగిస్తున్నారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ, సహాయక చర్యల కోసం భారీగా బలగాలను మోహరించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 11 బృందాలు రెస్క్యూ చర్యల్లో పాల్గొంటున్నాయి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 13 బృందాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయి.

రహదారులపై విరిగిపడిన చెట్లను తొలగించడానికి, నిలిచిపోయిన నీటిని తోడేందుకు ఫైర్ డిపార్ట్‌మెంట్ 185 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. తుపాను తీవ్రతను ముందుగానే ఊహించిన రాష్ట్ర యంత్రాంగం ముందస్తు హెచ్చరికలతో చర్యలు చేపట్టింది. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి 3,066 మంది గర్భిణులు, 1,008 మంది బాలింతలను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు, సురక్షిత వైద్య కేంద్రాలకు ముందస్తుగా తరలించారు.

వ్యాధులు వ్యాపించకుండా 13 జిల్లాల్లో 725 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం 362 అంబులెన్సులను నిరంతరం అందుబాటులో ఉంచారు.

వర్షాలు తగ్గిన తర్వాత దోమలు, నీటి ద్వారా వచ్చే వ్యాధులు (డెంగ్యూ, మలేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్) విజృంభించే అవకాశం ఉంది. నిల్వ ఉన్న నీటిలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ఆరోగ్య శాఖ సూచించింది. వైద్య శిబిరాలు, 104 సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More