అనకాపల్లి జిల్లాలో కారులో 230 కిలోల గంజాయి.. తమిళనాడు నుంచి శ్రీలంకకు స్మగ్లింగ్

అనకాపల్లి జిల్లాలో కారులో 230 కిలోల గంజాయిని పట్టుకున్నారు. తమిళనాడులో విక్రయించడంతోపాటుగా అక్కడ నుంచి శ్రీలంకకు స్మగ్లింగ్ చేసేందుకు ముఠా ప్లాన్ వేసింది.

Published on: Oct 20, 2026, 11:38:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీసు పరిధిలో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. గబ్బడ గ్రామం సమీపంలో దాదాపు 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు కోట్లలో ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

గంజాయి పట్టివేత
గంజాయి పట్టివేత

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసుకు సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శశి కుమార్ (52) తమిళనాడులోని తంజావూరు వాసి (ముఠా నాయకుడు), పాంగి సుబ్బారావు (21) అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లా జి.మాడుగుల మండలం, వి. చంటిబాబు (27) అల్లూరి సీతారామరాజు జిల్లా, అమల్ రాజ్, మణికంఠన్ చంద్ర కుమార్ తమిళనాడు వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు.

విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌కు బీజం 2024లో పడింది. 2024లో తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లా జైలులో శశి కుమార్, చంటిబాబులకు పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలయ్యాక సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి స్మగ్లింగ్ వ్యాపారంలోకి దిగాలని ఇద్దరూ పథకం రచించారు.

జైలు నుంచి బయటకు వచ్చాక శశి కుమార్ సూచనల మేరకు చంటిబాబు అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఏజెంట్లతో మాట్లాడాడు. ఆపై పాంగి సుబ్బారావు సహాయంతో ఒడిశా సరిహద్దుల్లోని జంతపాయి గ్రామం నుంచి 230 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు.

సేకరించిన గంజాయిని జి.మాడుగుల మండలంలోని అలగామ గ్రామానికి తరలించి, అక్కడ రహస్యంగా నిల్వ ఉంచారు. తమిళనాడు నుంచి అమల్ రాజ్, మణికంఠన్‌లతో కలిసి శశి కుమార్ కారులో అల్లూరి జిల్లాకు చేరుకున్నాడు. అలగామలో నిల్వ ఉంచిన గంజాయి లోడ్‌ను కారులోకి ఎక్కించి, దానికి సెక్యూరిటీగా మరో రెండు పైలట్ వాహనాలలో కాకినాడ జిల్లా తుని వైపు ప్రయాణమయ్యారు.

ఈ గంజాయిని చెన్నై, కోయంబత్తూర్, తంజావూరు వంటి నగరాల్లో విక్రయించడమే కాకుండా, సముద్ర మార్గం గుండా శ్రీలంకకు తరలించి అక్కడ అత్యధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా రవాణా గురించిన పక్కా సమాచారంతో నర్సీపట్నం రూరల్ పోలీసులు గబ్బడ గ్రామం వద్ద నిఘా ఏర్పాటు చేశారు. కారుతో పాటు పైలట్ వాహనాలుగా వస్తున్న వాహనాలను అడ్డుకుని తనిఖీ చేయగా 230 కిలోల గంజాయి బయటపడింది. వాహనాలు, గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి నిర్మూలనకు ఈగిల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిఘాను తీవ్రం చేసింది. మత్తు పదార్థాలు, గంజాయి విక్రయాలు లేదా అక్రమ రవాణాపై సమాచారం తెలిస్తే ప్రజలు 14500 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More