Jantar Mantar : జంతర్ మంతర్ ఇక నిరసన స్థలం కాదు! దిల్లీలో 3 కొత్త ప్రదేశాలు కేటాయించిన పోలీసులు

దేశ రాజధాని దిల్లీలో ధర్నాలు, ఆందోళనల ప్రధాన వేదికగా దశాబ్దాలుగా ఉన్న జంతర్ మంతర్‌ను పోలీసులు డీ-నోటిఫై చేశారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు దిల్లీలోని సీబీడీ మైదానాలను నూతన నిరసన వేదికలుగా ప్రకటించారు.

Updated on: Oct 12, 2026, 13:46:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశ రాజధాని దిల్లీలో ప్రజాస్వామ్య నిరసనలకు నిలయంగా ఉన్న చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద ఇకపై ధర్నాలు, ఆందోళనలు చేపట్టడానికి వీల్లేదు! దశాబ్దాలుగా ఉద్యమాలు, ధర్నాలకు వేదికగా నిలిచిన ఈ జంతర్ మంతర్‌ను నిరసనలు చేసే స్థలాల జాబితా నుంచి తొలగిస్తూ (డీ-నోటిఫై)దిల్లీ పోలీసులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జంతర్ మంతర్​కి ప్రత్యామ్నాయంగా నిరసనకారుల కోసం నగరంలోని మూడు విభిన్న ప్రాంతాలను నూతన ధర్నా చౌక్‌లుగా ఖరారు చేశారు.

జంతర్ మంతర్ ఇక నిరసన స్థలం కాదు! (PTI)
జంతర్ మంతర్ ఇక నిరసన స్థలం కాదు! (PTI)

కేంద్ర హోంశాఖ కమిటీ ప్రతిపాదనలు..

పౌరులు తమ ఆందోళన తెలిపే హక్కును కాపాడుతూనే, నగరంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను అన్వేషించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదిక, సిఫార్సుల ప్రాతిపదికగానే దిల్లీ పోలీసులు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

పోలీసులు కొత్తగా కేటాయించిన మూడు వేదికలు:

  • రామ్‌లీలా మైదాన్ (సెంట్రల్ దిల్లీ)
  • బురారీ మైదాన్ (ఉత్తర దిల్లీ)
  • సీబీడీ మైదాన్ (తూర్పు దిల్లీ - సీబీడీ గ్రౌండ్స్)

ఈ నూతన వేదికల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడానికి పాటించాల్సిన రివైజ్డ్​ ప్రామాణిక నిర్వహణ విధానాలను దిల్లీ పోలీసులు త్వరలోనే విడిగా విడుదల చేయనున్నారు.

డీ-నోటిఫికేషన్ వెనుక ప్రధాన కారణాలు..

దిల్లీలోని ల్యూటియన్స్ జోన్‌లో ఉన్న జంతర్ మంతర్ వీధి.. పార్లమెంట్ భవనం, నార్త్-సౌత్ బ్లాక్‌లు, ప్రధానమంత్రి కార్యాలయం, సుప్రీంకోర్టుకు అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడ నిత్యం ఏదో ఒక రకమైన నిరసన కార్యక్రమం జరగడం వల్ల ప్రధాన రహదారులపై రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో తీవ్రస్థాయిలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి సాధారణ పౌరులు, అత్యవసర వాహనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

దీనికి తోడు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున నిరసనకారులు జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడం, భద్రతా కారణ దృష్ట్యా వేలాది మందిని అదుపులోకి తీసుకోవడం, నగరంలో బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 163 వంటి ఆంక్షలు విధించాల్సి రావడం వల్ల ఈ వేదిక మార్పు నిర్ణయం త్వరితగతిన కార్యరూపం దాల్చింది.

సీజేపీ నిరసనలతో ఇటీవలి కాలంలో జంతర్ మంతర్ పేరు తరచూ వార్తల్లో వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపై ఎవరైనా నిరసనలు తెలపాలంటే నిర్దేశిత మూడు మైదానాల్లో మాత్రమే అనుమతి లభిస్తుంది. కొత్త ఎస్‌ఓపీల ప్రకారం మైదానాల సామర్థ్యం, మైకుల వాడకంపై పరిమితులు, సమయ వేళలు, పార్కింగ్ సదుపాయాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల దిల్లీ నడిబొడ్డున రద్దీ తగ్గడంతో పాటు, నిరసనకారులకు విస్తృతమైన స్థలం అందుబాటులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More