Heavy rain alert : దిల్లీలో కుండపోత వర్షం- ఐఎండీ రెడ్ అలర్ట్.. భారీగా నిలిచిన ట్రాఫిక్!
సోమవారం ఉదయం దిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిని ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం ముంచెత్తింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, ఉరుములు మెరుపుల ధాటికి పలుచోత్స రహదారులు జలమయమయ్యాయి. తాజా పరిస్థితుల వేళ ఐఎండీ తక్షణ హెచ్చరికలు జారీ చేసింది.
సోమవారం తెల్లవారుజామున నుంచి దేశ రాజధాని దిల్లీతో పాటు చుట్టుపక్కల ఉన్న ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అయితే, ఉదయం పూట ఆఫీసులు, పాఠశాలలకు వెళ్లే ప్రధాన సమయంలోనే ఈ వర్షం కురుస్తుండటంతో నగరంలోని పలు కీలక జంక్షన్లలో ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ!
వాతావరణ తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 15 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనికి తోడు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని 'నావ్‌కాస్ట్' హెచ్చరికలు పంపింది.
ఇ దిల్లీతో పాటు నోయిడా, గుర్గావ్, ఘాజియాబాద్ నగరాల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతోంది.
మునిగిన రహదారులు.. స్తంభించిన రవాణా!
హఠాత్తుగా పలకరించిన ఈ వర్షం ధాటికి సెంట్రల్ దిల్లీలోని కరోల్ బాగ్, ఝండేవాలాన్ ఆలయం సమీపంలోని పరిసర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదల్లేక ప్రయాణం నెమ్మదించింది.
"లోతైన ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. ప్రయాణాలు ప్రారంభించే ముందే ట్రాఫిక్ సలహాలను గమనించాలి," అని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
రాబోయే ఆరు రోజులు వాతావరణం ఎలా ఉండనుంది?
సోమవారం ఉదయం కుండపోత వర్షం కురిసినప్పటికీ, రాబోయే ఆరు రోజుల పాటు దిల్లీలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, వాతావరణం పొడిగా మారనుందని అంచనా వేసింది. రాబోయే రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.
అక్టోబర్ 13 నుంచి 17 వరకు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి 22 నుంచి 25 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని ఐఎండీ నివేదిక పేర్కొంది.
ఇక దిల్లీలో ఉదయం కురిసిన ఈ వర్షం నగరంలో శీతాకాలపు రాకకు సంకేతంగా మారింది.
ఈనెల 16 నుంచి తెలంగాణలో వర్షాలు!
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం.... రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. అక్టోబర్ 15వ తేదీ వరకు కూడా పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుంది. ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు. ఇక అక్టోబర్ 16 ఉదయం నుంచి అక్టోబర్ 18 ఉదయం వరకు వర్షాలు పడొచ్చు.
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


