AP Rains : 122 రోజులలో 46 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు.. ఒక్క రోజు అత్యంత భారీ వర్షం

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలోని 122 రోజులలో ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 46 రోజులు మాత్రమే వర్షం కురిసింది సాధారణంగా 75 నుండి 90 రోజులు వర్షం పడుతుంది. అందులోనూ కేవలం ఒక్క రోజు మాత్రమే 'అత్యంత భారీ వర్షం' నమోదైంది.

Updated on: Oct 2, 2026, 11:01:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ తీవ్ర వర్షపాత లోటుతో ముగిసింది. సాధారణంగా సీజన్‌లో వచ్చే 75 నుంచి 90 వర్షపు రోజులకు గాను, ఈ ఏడాది మొత్తం 122 రోజులలో కేవలం 46 రోజులు మాత్రమే రాష్ట్రంలో వర్షాలు కురిశాయి. ఇందులోనూ భారీ వర్షం కురిసిన రోజు కేవలం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే కావడం గమనార్హం. అక్టోబర్ 15 నాటికి దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరించుకోనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సేకరించిన గణాంకాల ప్రకారం, ఈ సీజన్‌లో ఒకే ఒక్క రోజు మాత్రమే అతి భారీ వర్షపాతం(115.6 మి.మీ నుండి 204.4 మి.మీ) నమోదైంది. ఈ భారీ వర్షం విశాఖపట్నం జిల్లా పరిధిలోనే నమోదైంది. మరోవైపు 64.5 మి.మీ నుండి 115.5 మి.మీ మధ్య వర్షపాతం నమోదయ్యే భారీ వర్షపు రోజులు మొత్తం 20 గా నమోదయ్యాయి.

వీటిలో అత్యధికం ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అత్యధికంగా 3 రోజులు, శ్రీకాకుళం, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరులో 2 రోజులు ఉన్నాయి.

రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఈ సీజన్ పొడవునా ఒక్క 'భారీ వర్షపు రోజు' కూడా నమోదు కాకపోవడం అక్కడి వర్షాభావ పరిస్థితులకు అద్దం పడుతోంది.

వాతావరణ నిపుణుల ప్రకారం, సాధారణంగా ఈ సీజన్‌లో జిల్లాల్లో 75 నుండి 90 రోజుల పాటు వర్షం కురుస్తుంది. ఈ ఏడాది ఉత్తర, మధ్య ఆంధ్ర ప్రాంతాల్లో 40 నుండి 54 రోజుల పాటు వర్షం కురవగా, రాయలసీమలో 11 నుండి 30 రోజుల మధ్య వర్షం కురిసింది. గత నాలుగు నెలల్లో అత్యల్పంగా అన్నమయ్య జిల్లాలో 11 రోజులు వర్షం కురవగా, ఆ తర్వాతి స్థానాల్లో శ్రీ సత్యసాయి జిల్లా (17 రోజులు), అనంతపురం జిల్లా (20 రోజులు) ఉన్నాయి.

ఈ కాలంలో పోలవరం, ఏ.ఎస్.ఆర్ జిల్లాల్లో అత్యధికంగా 54 రోజుల పాటు వర్షం కురవగా, విజయనగరం జిల్లాలో 48 రోజులు, అలాగే పార్వతీపురం మన్యం, ఎన్.టి.ఆర్ జిల్లాల్లో 46 రోజుల పాటు వర్షం నమోదైంది. విశాఖపట్నం జిల్లాలో పొరుగు జిల్లాలతో పోలిస్తే అత్యంత తక్కువగా 31 వర్షపు రోజులు నమోదయ్యాయి. అయితే గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ లోటు భర్తీ అయింది.

ఒక జిల్లాలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మండలాల్లో 2.5 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే దానిని సగటున ఆ జిల్లా వర్షపు రోజుగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లాలో 46 వర్షపు రోజులు ఉన్నాయంటే జిల్లాలోని ప్రతి మండలంలోనూ వర్షం పడిందని అర్థం కాదని, రాష్ట్రవ్యాప్తంగా వర్షపాత విస్తరణ అసమానంగా ఉందనడానికి ఇది నిదర్శనమని నిపుణులు తెలిపారు.

సెప్టెంబరు 30 నైరుతి సీజన్ నాటికి రాష్ట్రంలో మొత్తం వర్షపాత లోటు 35.4 శాతానికి చేరింది. గత వారం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వల్ల తీర ప్రాంత జిల్లాల్లో కొంత ఉపశమనం లభించినప్పటికీ, ప్రస్తుతం లోటు మళ్లీ పెరుగుతోంది. జూన్ 1 నుండి అక్టోబర్ 1 మధ్యకాలంలో అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 62.6 శాతం, ప్రకాశం జిల్లాలో 60.4 శాతం చొప్పున తీవ్ర వర్షపాత లోటు నమోదైంది. అక్టోబరు నెలలో కూడా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. మెుత్తం లెక్కలు వేసుకుని చూసుకుంటే రాష్ట్రంలో 122 రోజులలో 46 రోజులు వర్షాలు కురిశాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More