కడపలో ఉద్రిక్తత : జంక్షన్ పేరు మార్పుపై వివాదం.... సెక్షన్ 144 విధింపు, అసలేం జరిగిందంటే..?

Kadapa Junction Renaming Clash : కడప నగరంలోని అల్మాస్‌పేట జంక్షన్ పేరు మార్పు వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. రాళ్ల దాడి, ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు సెక్షన్ 144 విధించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Published on: May 11, 2026, 06:54:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kadapa Junction Renaming Clash : కడప నగరంలో ట్రాఫిక్ జంక్షన్ నామకరణం వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అల్మాస్‌పేట సర్కిల్ వద్ద శనివారం రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం చివరకు రాళ్ల దాడికి…. పోలీసులపై దాడులకు దారితీసింది. ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీస్ యంత్రాంగం నిందితులను ఏరివేసే పనిలో పడింది. ప్రస్తుతం నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంది.

కడపలో 144 సెక్షన్
కడపలో 144 సెక్షన్

అసలేం జరిగింది…..?

స్థానిక అల్మాస్‌పేట జంక్షన్‌కు ఒక వర్గం టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని డిమాండ్ చేయగా, మరో వర్గం హనుమాన్ జంక్షన్‌గా నామకరణం చేయాలని పట్టుబట్టింది. ఈ రెండు వర్గాల మధ్య వాగ్వివాదం కాస్తా ముదిరి పరస్పరం రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలను అదుపు చేసే క్రమంలో పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు.

కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదివారం ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ.. "హింసకు పాల్పడిన కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాం. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు," అని స్పష్టం చేశారు. నగరంలో శాంతిని నెలకొల్పేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

12 ఏళ్ల నాటి వివాదం…

పోలీసుల సమాచారం ప్రకారం…. ఈ జంక్షన్ పేరుపై వివాదం నేటిది కాదు.. గత 12 ఏళ్లుగా అడపాదడపా ఈ అంశంపై ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో "నా మాటే చెల్లాలి" అనే ధోరణి సరైంది కాదని, అందరికీ ఆమోదయోగ్యమైన మార్గంలోనే సమస్యను పరిష్కరించుకోవాలని డీఐజీ హితవు పలికారు. రెండు వర్గాల వారితో కౌన్సెలింగ్ నిర్వహించి, జిల్లాలో మత సామరస్యాన్ని కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు.

కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ విశ్వనాథ్ సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సున్నితమైన చిన్న విషయాలను పెద్దవి చేసి కడప నగర ప్రశాంతతను దెబ్బతీయొద్దని వారు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం అల్మాస్‌పేట పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం(144 సెక్షన్) ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా నేత్రాలను (CC కెమెరాలు) పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More