మార్చి నాటికి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.. ఫ్యామిలీ కార్డులకు సీఎం చంద్రబాబు డెడ్‌లైన్
మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీల అమలు క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందోననే అంశంపై ప్రత్యక్షంగా చూడాలని సూచించారు.
రాష్ట్ర సచివాలయంలో ఐదో బ్లాకులో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో పర్యటించాలి
పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా... క్షేత్ర స్థాయిలో పాలసీలు అమలుకానప్పుడు ఫలితం ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. వారి వారి శాఖల పనితీరు ఎలా ఉందన్న అంశంపై పరిశీలించడానికి తరుచూ ఫీల్డ్ విజిట్స్ చేపట్టాలని సీఎం సూచించారు. వివిధ వర్గాల ప్రజలతో అధికారులు తరుచూ మాట్లాడుతూ ఉంటే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.
సమాచారం పరిశీలించాలి
'ప్రతీ ఐదేళ్లకూ జీఎస్డీపీ, తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా ప్రణాళికలు చేపట్టాలి. తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తుంది. కీ-పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల విషయంలో జాగ్రత్తగా అంచనాలు వేయాలి. క్షేత్రస్థాయి నుంచి తీసుకునే సమాచారం ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకోవాలి. పీ4 అనేది రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు తగ్గించే ప్రత్యేక కార్యక్రమం. మార్గదర్శులు బంగారు మిత్రలను నియమించుకోవాలి. వారి ద్వారా ఆయా పేద కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి.' అని చంద్రబాబు అన్నారు.
జీతాలు చెల్లిస్తున్నాం
గత పాలకులు చేసిన అప్పుల కారణంగా 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఏపీ క్రెడిట్ రేటింగ్ పెంచుకుని వడ్డీ తగ్గించుకునేలా రుణాల రీషెడ్యూలు చేస్తున్నామన్నారు. 2019-24 మధ్య ఆర్ధిక క్రమశిక్షణ దెబ్బతీశారన్నారు. జీతాలు కూడా మొదటి తేదీకి ఇవ్వలేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు జీతాల చెల్లింపులను గాడిలో పెట్టామన్నారు.
పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ
'సంజీవని ద్వారా జూలై 2026 నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలి. 5 లక్షల మంది హాస్టల్ విద్యార్ధుల స్ర్కీనింగ్ చేపట్టాలి. 12వ తరగతి వరకూ ఉన్న 70 లక్షల మంది విద్యార్ధుల హెల్త్ ప్రోఫైల్స్ కూడా తయారు చేయాలి. కేర్ అండ్ గ్రో ద్వారా మాతా శిశు ఆరోగ్యం, పెరుగుదలను నమోదు చేయాలి. పౌష్టికాహారం అందించటంతో పాటు అవసరమైన సప్లిమెంట్స్ అందించేలా చర్యలు. నార్మల్ డెలివరీలు పెరిగేలా చూడాలి. వచ్చే ఏడాది ఎయిడ్స్ ఫ్రీ ఏపీగా డిక్లేర్ చేస్తాం. ఫ్యామిలీ కార్డు బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా జూన్ నాటికి సమగ్రమైన ఓ కార్డు జారీ చేస్తాం. మార్చి నాటికి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.' అని చంద్రబాబు చెప్పారు.
100 రోజుల యాక్షన్ ప్లాన్
పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చంద్రబాబు అన్నారు. పరీక్షలు అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా ఈ కార్యాచరణలో భాగం చేయాలన్నారు. ఒత్తిడి కారణంగా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోడానికి వీల్లేదని చెప్పారు. లేటరల్ ఎంట్రీ ఉండేలా యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో చర్యలు చేపట్టాలన్నారు. ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ వంటి వారు ఉన్నత విద్యను అభ్యసించి సర్టిఫికెట్లను పొందేలా కార్యాచరణ ఉండాలన్నారు.
వేసవిపై సీఎం సూచనలు
'పారిశ్రామిక కాలుష్యం ద్వారా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడాలి. సురక్షితమైన తాగునీరు ప్రజలకు అందాలి. బోర్ల నుంచి కలుషితమైన నీరు రావటానికి వీల్లేకుండా చూడాలి. ఆశ్రమ బాలుర హాస్టల్లో కలుషిత నీరు కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన పరిస్థితి ఎదురైంది. ఈ తరహా ఘటనలు ఇక రాష్ట్రంలో ఉత్పన్నం కాకూడదు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే... దానికి సంబంధిత జిల్లా కలెక్టర్, ఇంఛార్జీ మంత్రులదే బాధ్యత. వేసవి రాబోతోంది. నీటి ఎద్దడి అనేది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి నుంచే సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి.' అని ముఖ్యమంత్రి అన్నారు.

E-Paper












