శ్రీశైలంలో మహాశివరాత్రికి ఏర్పాట్లు.. ఘాట్ రోడ్డులోకి లోడ్లతో ప్రవేశించే వాహనాలకు జరిమానా!

శ్రీశైలంలో మహాశివరాత్రికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డులోకి లోడ్లతో ప్రవేశించే వాహనాలకు భారీగా జరిమానా విధించాలని అధికారులు నిర్ణయించారు.

Published on: Feb 1, 2026, 21:52:19 IST
By , Srisailam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహా శివరాత్రి పండుగ దగ్గరకు వస్తోంది. దీంతో శ్రీశైలం క్షేత్రానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం ఆలయంలో సన్నాహాలు ముమ్మరం చేశారు. మూడు రోజుల పండుగ సమయంలో సుమారు ఏడు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 15న మహా శివరాత్రి ఉంది.

శ్రీశైలం
శ్రీశైలం

భక్తుల సంఖ్య పెరిగే నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ శాఖల సంయుక్త పర్యవేక్షణలో విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రధాన శివరాత్రి గమ్యస్థానాలలో ఒకటిగా శ్రీశైలం ఉంది. పండుగ సమయంలో శ్రీశైలంలో భారీగా జనసందోహం చూసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

శ్రీశైలం ఆలయం నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చినప్పటికీ, ఇది మార్కాపురం జిల్లా సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఈ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రెండు జిల్లాల అధికారులను సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. నంద్యాల, మార్కాపురం జిల్లాల పోలీసులు, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లు రద్దీ నిర్వహణను సజావుగా ఉండేలా ఇప్పటికే ఉమ్మడి ప్రణాళికను ప్రారంభించారు. భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించడానికి క్యూ లైన్లను క్రమబద్ధీకరించడం, రద్దీని మెరుగుపరచడంపై అధికారులు దృష్టి సారించారు.

రద్దీ, ట్రాఫిక్ నిర్వహణ చర్యలలో భాగంగా ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 20 వరకు 20 రోజుల పాటు ఘాట్ రోడ్డుపై ఆంక్షలు అమలు ఉంటాయి. ఈ కాలంలో నల్లమల అటవీ ప్రాంతం గుండా లోడ్ చేసిన వస్తువుల వాహనాలను అనుమతించరు.

విజయవాడ నుంచి వెళ్లే గూడ్స్ వాహనాలను కర్నూలు, నంద్యాల మీదుగా మళ్లిస్తారు. నిబంధనలను ఉల్లంఘించి ఘాట్ రోడ్డులోకి లోడ్లతో ప్రవేశించే వాహనాలపై భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు, ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు.

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగ ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు మార్కాపురం జిల్లాతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశామన్నారు. దాదాపు 2,500 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తామని పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More