బాబోయ్ సంక్రాంతి.. టికెట్ ధరలతో ప్రైవేట్ బస్సుల బాదుడే బాదుడు!

సంక్రాంతికి ఊరెళ్లాలి అనుకునేవారికి టికెట్ ధరలు చుక్కలు చూపించనున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు భారీ ధరలతో ప్రయాణికుల దగ్గర అధిక మెుత్తంలో వసూలు చేస్తున్నాయి.

Published on: Nov 26, 2025, 14:36:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఛార్జీలను విపరీతంగా పెంచుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ నుండి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాలకు వెళ్లే రైళ్లు, ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. దీని వలన ప్రయాణికులు ప్రైవేట్ బస్సు సర్వీసులపై ఆధారపడవలసి వస్తోంది. ఇదే ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ దండుకుంటున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రవాణా శాఖ, రైల్వే విభాగాలు ప్రత్యేక బస్సులు, రైళ్లను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్నాయని, దీని వలన ప్రైవేట్ బస్సుల టికెట్లకు డిమాండ్‌ మరింత పెరుగుతుందని కొందరు ఆరోపిస్తున్నారు. జనవరి 9, 10 తేదీలు పండుగ సీజన్‌కు దగ్గరగా ఉండటంతో బుకింగ్‌లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. ఏపీఎస్ఆర్టీసీ 50 శాతం గరిష్టంగా అదనపు పండుగ ఛార్జీలను వసూలు చేస్తుండగా, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు రెండు నుండి మూడు రెట్లు ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఛార్జీలను పెంచడంపై పదేపదే ఫిర్యాదులు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై రవాణా శాఖ విమర్శలు ఎదుర్కొంటోంది.

హైదరాబాద్-విశాఖపట్నం మార్గంలో ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీ రూ.1,889 కాగా, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు సీటర్‌కు రూ.5,000 నుండి రూ.5,999 వరకు, స్లీపర్ బెర్త్‌కు రూ.6,999 వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం మధ్య ప్రయాణానికి ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీ సూపర్ లగ్జరీ సర్వీస్‌కు రూ.1,032 నుండి స్లీపర్‌కు రూ.2,338 వరకు ఉంటుంది. అయితే ప్రైవేట్ బస్సులు సీటర్ టిక్కెట్లకు రూ.2,599 నుండి రూ.4,999 వరకు, స్లీపర్‌కు దాదాపు రూ.5,999 వరకు వసూలు చేస్తున్నాయి.

అదేవిధంగా హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రయాణించే ప్రయాణీకులు సాధారణంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో రూ.440 చెల్లిస్తారు. కానీ ప్రైవేట్ ఆపరేటర్లు సీటర్‌కు రూ.1,750 నుంచి రూ.1,790 మధ్య తీసుకుంటున్నారు. స్లీపర్‌లో రూ.3,500 నుంచి రూ.5,999 మధ్య ఛార్జీలను నిర్ణయించారు. హైదరాబాద్-బెంగళూరు మార్గంలో ఏపీఎస్ఆర్టీసీ స్లీపర్ టికెట్ ధర రూ.1,203, అయితే ప్రైవేట్ బస్సు ఛార్జీలు ఆపరేటర్‌ను బట్టి రూ.2,799 నుంచి రూ.6,899 మధ్య ఉంటాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More