చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 10 మందికి గాయాలు
తెలంగాణలోని కోదాడ రోడ్డు ప్రమాదం మరవకముందే ఏపీలో మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు, 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఘరోమైన రహదారి ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను తీవ్రంగా ఢీకొట్టడంతో ఏడుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. చిలకలూరిపేట పరిసర ప్రాంతంలో ఆటో డ్రైవర్ ఒక్కసారిగా సడెన్ టర్న్ తీసుకోవడం వల్ల, వెనుక నుంచి వేగంగా వస్తున్న బస్సు అదుపు చేయలేక ఆటోను బలంగా ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఢీకొన్న తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది.
ఈ ఘోర ప్రమాదంలో ఆటో డ్రైవర్ బాబుతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ గంగమ్మ, మరియమ్మ, సువార్తమ్మ, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారు. వీరంతా పనుల నిమిత్తం ప్రకాశం జిల్లాలోని కొండమంజులూరుకు వెళ్లి, తిరిగి తమ స్వగ్రామమైన వేలూరుకు ఆటోలో వస్తుండగా మార్గమధ్యలో ఈ విషాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 10 మందిని తక్షణమే మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఒకే ప్రమాదంలో మరణించడంతో వేలూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


