...
...
Next Story

దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా పుట్టపర్తి : సీఎం చంద్రబాబు

దేశం గర్వించే రక్షణ కేంద్రంగా పుట్టపర్తి తయారు అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోనే ఆధునిక డ్రోన్ ఎకో సిస్టమ్‌కు శ్రీకారం చుట్టామన్నారు.

Published on: May 15, 2026, 16:47:30 IST
Advertisement

ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోని అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు శిలాఫలకాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఎఫ్ సీఎల్ ప్రాజెక్టులకు చెందిన శిలాఫలకాలను వర్చువల్‌గా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలతో విశ్వశాంతికి బాటలు పడ్డాయన్నారు. పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు రావటం ఎంతో కీలకమని చెప్పారు. దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగానూ పుట్టపర్తి మారుతుందన్నారు. AMCA ప్రాజెక్టుతో ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యసాధనలో ఏపీ ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు.

'భారత రక్షణ రంగాన్ని ఆధునీకరించటంతో పాటు బలోపేతం చేయటంపై ప్రధాని దృష్టి సారించారు. ఆధునికతరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేసేలా AMCA ప్రాజెక్టు ఏర్పాటు అవుతోంది. భారత రక్షణ శక్తిని ప్రపంచానికి చాటటంలో ఆపరేషన్ సింధూర్ ఓ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఆపరేష్ సింధూర్‌లో వినియోగించిన డ్రోన్లు ఏపీలోనే తయారై, టెస్ట్ చేశారు. AMCA లాంటి ప్రాజెక్టును ఏపీకి కేటాయించినందుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు ధన్యవాదాలు.' అని చంద్రబాబు అన్నారు.

రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 7500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టు వస్తుందని చంద్రబాబు చెప్పారు. ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్‌తో పాటు ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రంగా పుట్టపర్తి మారుతుందన్నారు. అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేయటంలో రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాయని తెలిపారు. కేవలం 36 రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగలిగాం... జెట్ స్పీడ్‌తో అనుమతులిచ్చామన్నారు.

శ్రీహరికోట అంతరిక్షశక్తి, నాగాయలంకలో క్షిపణిశక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తిగా ఏపీ దేశానికే అండగా నిలుస్తుందని చంద్రబాబు చెప్పారు. గతంలో రాయలసీమ రతనాల సీమ.. కానీ వివిధ కారణాల వల్ల కరవుసీమగా మారిపోయిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ పరిస్థితిని మార్చామని తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు కూటమి ప్రభుత్వం రాయలసీమకు నీరిచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం చెప్పారు. ప్రతీ ఎకరాకూ నీరిచ్చేలా కార్యాచరణ చేపట్టాం. కియా పరిశ్రమకు నీరిచ్చాం. లక్ష కోట్ల రూపాయలతో సీమను హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నామన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks