AP Monsoon 2026 : రుతుపవనాల గమనంలో విరామాలు - ఈసారి వర్షాలు తక్కువే..! అంచనాలు ఇలా

AP Monsoon Forecast 2026 : ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు వివరాలను పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Published on: Jun 7, 2026, 08:00:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Monsoon Forecast 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల గమనం. వర్షపాతానికి సంబంధించి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) కీలక అంచనాలను విడుదల చేసింది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాగే ఈ రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేసింది. స్థానిక వాతావరణ మార్పుల కారణంగా అక్కడక్కడా కురిసే వర్షాలు ఈ వర్షపాత లోటును కొంతవరకు భర్తీ చేసే అవకాశం ఉందని పేర్కొంది.

నైరుతి రుతపవాలు - కీలక అప్డేట్
నైరుతి రుతపవాలు - కీలక అప్డేట్

ఈసారి రుతుపవనాల ప్రయాణంలో తరచూ విరామాలు ఏర్పడే ప్రమాదం ఉందని వివరించింది. అంటే కొన్ని రోజుల పాటు నిరంతరాయంగా వర్షాలు కురిసి, ఆ తర్వాత మరికొన్ని రోజుల పాటు వాతావరణం పూర్తిగా పొడిగా మారే పరిస్థితులుంటాయి. ఈ విభిన్న వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని రైతాంగం తమ పంట ప్రణాళికలను ఎంతో జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

జిల్లాల వారీగా వర్షపాత సూచనలు - అంచనాలు :

రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఈసారి వర్షాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, పోలవరం ప్రాంతాలతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలైన కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, కడప, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

  • కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు దంచికొట్టనున్నాయి. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఈ సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
  • ఉత్తరాంధ్రతో పాటు పరిసర ప్రాంతాల్లో వాతావరణం సాధారణంగా ఉండనుంది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అందించిన సమాచారం ప్రకారం….. జూన్ 6 శనివారం నాడు రుతుపవనాలు ఏపీలోని రాయలసీమ ప్రాంతాలను తాకాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు చూస్తుంటే…. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి మరింత బలాన్ని పుంజుకుని, ఆంధ్రప్రదేశ్ అంతటా వేగంగా విస్తరించడానికి పూర్తి అనుకూల వాతావరణం ఉంది.

గత సంవత్సరంతో పోల్చి చూస్తే…. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైందని చెప్పాలి. గతేడాది, అంటే 2025లో మే 26వ తేదీనే నైరుతి రుతుపవనాలు ఎంతో ముందుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. అయితే ఈ ఏడాది దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల జూన్ 4న కేరళను తాకిన రుతుపవనాలు…. అక్కడి నుంచి రెండు రోజుల్లోనే ఏపీలోకి అడుగుపెట్టాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాల్సి ఉండగా, ఈసారి దాదాపు అదే సమయానికి ఇవి పలకరించడం గమనార్హం.

రుతుపవనాలు ప్రవేశించిన తొలినాళ్లలో ఉక్కపోత, వేడిమి పరిస్థితులు యథావిధిగా కొనసాగుతాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో రాబోయే కొద్ది రోజుల పాటు వేడిగాలుల (హీట్ వేవ్) ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం ఉందని…. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More