Ramoji Excellence Awards 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి
Ramoji Excellence Awards 2026 : విజయవాడలో జరిగిన రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులు 2026 వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రామోజీరావు జయంతిని ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని చెప్పారు.
దివంగత మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు స్మారకార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా ఆయన జయంతిని ‘రాష్ట్ర పండుగ’గా అధికారికంగా నిర్వహిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులు - 2026 ప్రదానోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా, సీఎం చంద్రబాబు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలో అమిత్ షా, చంద్రబాబులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని, పాత్రికేయ, సినీ రంగాలకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తుచేసుకున్నారు.
సమస్యలకు పరిష్కారం చూపే దార్శనికుడు: కేంద్ర మంత్రి అమిత్ షా
రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన స్థాపించిన సంస్థల ద్వారా అందుతున్న సేవలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన తనను రామోజీరావు తన కారులో వేదిక వద్దకు తీసుకెళ్లారని, అలా తమ మధ్య పరిచయం ఏర్పడిందని అమిత్ షా గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత నాలుగుసార్లు కలిసిన ప్రతిసారీ ప్రపంచ విషయాలపై ఆయనకున్న అవగాహన, సమస్యలకు స్పష్టమైన పరిష్కారం చూపే తీరు చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు.
కృష్ణా జిల్లాలోని ఒక సాధారణ గ్రామంలో పుట్టి, ఎలాంటి వారసత్వ ఆస్తులు, జర్నలిజం డిగ్రీ లేకపోయినా కేవలం కఠోర శ్రమ, దార్శనికతతో ఎదిగారని ప్రశంసించారు అమిత్ షా. నిత్యం తెలుగు ప్రజలకు సత్యాన్ని అందించే విషయంలో ఆయన్ను దిగ్గజ పాత్రికేయులు రామ్‌నాథ్ గోయెంకాతోనే పోల్చగలమని అన్నారు. 24 గంటల ప్రాంతీయ వార్తా ఛానళ్లను ప్రారంభించి దేశంలోని ఇతర భాషా ఛానళ్లకు గౌరవం తెచ్చారని పేర్కొన్నారు.
ఇక సినిమా రంగంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఒక అద్భుతమని, చేతిలో కథ, కళాకారులు, డబ్బు ఉంటే చాలు అక్కడికి వెళ్లి పూర్తి సినిమా నిర్మించుకుని రావచ్చని ఓ గుజరాతీ నిర్మాత తనతో అన్న మాటలను అమిత్ షా ప్రస్తావించారు. విలువల కోసం రాజీలేని పోరాటం చేసిన మహనీయుడు రామోజీరావు అని కొనియాడారు.
కూర్చున్న చోటే ఓ విశ్వవిద్యాలయం: సీఎం చంద్రబాబు
1980 నుంచి నాలుగున్నర దశాబ్దాల పాటు రామోజీరావుతో తనకున్న సుదీర్ఘ ప్రయాణాన్ని సీఎం చంద్రబాబు భావోద్వేగంతో పంచుకున్నారు. తాను తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రామోజీరావు అన్న మాటలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదని, సాధారణ వ్యక్తులలోని ప్రతిభను వెలికితీసి అసాధారణ వ్యక్తులుగా మలిచిన శిల్పి అని చంద్రబాబు అభివర్ణించారు. ఆయన ఎక్కడికీ వెళ్లకపోయినా, కూర్చున్న చోటే ఒక విశ్వవిద్యాలయంలా అధ్యయనం చేసేవారని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా దేశానికి అత్యవసరమైన బలమైన నాయకుడని రామోజీరావు తనతో ఎన్నోసార్లు చెప్పేవారని చంద్రబాబు వెల్లడించారు.
గతేడాది రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన ఈ అవార్డుల వేడుక, రెండో ఏడాది విజయవాడలో జరిగిందని, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహించాలని చూస్తున్నారని చంద్రబాబు తెలిపారు. జర్నలిజం, కళలు-సంస్కృతి, గ్రామీణాభివృద్ధి-వ్యవసాయం, మహిళా సాధికారత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, యూత్ ఐకాన్, విద్య, వైద్యం-ఆరోగ్యం వంటి విభిన్న రంగాల్లో విశేష సేవలందించిన 9 మంది ప్రతిభావంతులకు ఈ సందర్భంగా 'రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల'ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న రామోజీ గ్రూప్ సీఎండీ కిరణ్, కుటుంబ సభ్యులను అమిత్ షా, చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


