విశాఖలో మరో ఫిల్మ్ నగర్ - సీఐఐ స‌ద‌స్సులో చ‌ర్చ‌, సినీ నిర్మాణ కార్యకలాపాలపై హీరో రానా కీలక ప్రకటన..!

విశాఖపట్నాన్ని సినిమా, గేమింగ్, డిజిటల్ కంటెంట్ రంగాలకు కేంద్రంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఐఐ సదస్సులో మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదనకు హీరో రానా సానుకూలంగా స్పందించి…. ఏడాదిలో విశాఖలో సినీ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు.

Published on: Nov 14, 2026, 16:57:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ వినోద పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి అడుగులు పడనున్నాయి. సాగర నగరి విశాఖను సినిమాలు, డిజిటల్ కంటెంట్, గేమింగ్ సహా ఇతర క్రియేటివ్ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కలను సాకారం చేసేందుకు ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చారు. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, రానా దగ్గుబాటి పాల్గొన్న లైవ్ పాడ్‌కాస్ట్ ఈ కీలక చర్చకు వేదికైంది.

సీఐఐ సమ్మిట్ లో మంత్రి లోకేశ్ తో రానా
సీఐఐ సమ్మిట్ లో మంత్రి లోకేశ్ తో రానా

మంత్రి లోకేశ్ తో కీలక చర్చ….

కేవలం సంప్రదాయ సినీ నిర్మాణానికి ఇచ్చే రాయితీలకే పరిమితం కాకుండా… విశాఖలో సమగ్రమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. స్టూడియోలు, షూటింగ్ సదుపాయాలు, పోస్ట్-ప్రొడక్షన్ మౌలిక సదుపాయాలతో పాటు అనుబంధ క్రియేటివ్ వ్యాపారాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. గతంలో హైదరాబాద్‌లో స్టూడియోలు, ఫిల్మ్ నగర్ నిర్మాణంతో అది దేశంలోనే అతిపెద్ద సినీ నిర్మాణ కేంద్రంగా ఎదిగిన తీరును లోకేశ్ గుర్తుచేశారు. ప్రభుత్వ ప్రోత్సాహం, సినీ పరిశ్రమ భాగస్వామ్యంతో విశాఖలోనూ అదే నమూనాను విజయవంతంగా అమలు చేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

నేటి కాలంలో ఆర్థిక వృద్ధికి 'క్రియేటర్ ఎకానమీ' ఒక కొత్త ఇంజిన్‌గా మారుతోందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. యూట్యూబ్ ప్రొడక్షన్స్, డిజిటల్ మీడియా, గేమింగ్ వంటి ఆధునిక రంగాల్లో అవకాశాలు వేగంగా విస్తరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్లు, అందుబాటులోకి వచ్చిన సాంకేతికత వల్ల యువ కంటెంట్ క్రియేటర్లకు అడ్డంకులు తొలగిపోయాయని, కంటెంట్ తయారీతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగాయని వివరించారు. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలు, సంస్థాగత మద్దతును అందిస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు.

విశాఖలో సినీ నిర్మాణ కార్యకలాపాలు: రానా దగ్గుబాటి

మంత్రి లోకేశ్ ప్రతిపాదనకు రానా దగ్గుబాటి సానుకూలంగా స్పందించారు. "రాబోయే ఏడాదిలో విశాఖపట్నంలో మా సంస్థ తరఫున సినీ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా కృషి చేస్తాను. విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ. ఈ నగరానికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని రానా తెలిపారు.

కేవలం సినిమాలకే కాకుండా డిజిటల్, ఇతర ఆధునిక ఫార్మాట్లలో పనిచేసే క్రియేటర్లకు అనుకూలమైన వాతావరణాన్ని విశాఖలో నిర్మించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక వైభవాన్ని రానా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఏపీలో చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలతో పాటు ప్రపంచానికి ఇంకా పూర్తిగా పరిచయం కాని ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేలా ప్రచారం కల్పించాలి. ఆ దిశగా మా ప్రయత్నాలను కొనసాగిస్తాం" అని హీరో రానా చెప్పారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More