గంటల లెక్కన రాపిడో టూరిజం బుకింగ్స్.. ఇక విశాఖ వెళ్తే డ్రైవర్లే టూరిస్ట్ గైడ్‌లు!

ఏపీ టూరిజం అథారిటీ, రాపిడో సంస్థ సంయుక్తంగా వైజాగ్, విజయవాడ, తిరుపతిలో డ్రైవర్-కమ్-గైడ్ ప్రోగ్రాం ప్రారంభించాయి. విశాఖలో ట్రైనింగ్ నడుస్తోంది.

Published on: May 24, 2026, 11:37:17 IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (APTA), ప్రముఖ రైడ్-హేలింగ్ సంస్థ రాపిడో' సంయుక్తంగా డ్రైవర్-కమ్-గైడ్ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఆటో, బైక్ డ్రైవర్లను సర్టిఫైడ్ టూరిస్ట్ గైడ్లుగా తీర్చిదిద్దనున్నారు.

విశాఖలో డ్రైవర్ కమ్ టూరిస్ట్ గైడ్
విశాఖలో డ్రైవర్ కమ్ టూరిస్ట్ గైడ్

వైజాగ్ లోని APTDC యాత్రి నివాస్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉండే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో మొదటి విడతగా 1,000 మందికి పైగా డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కేవలం విశాఖపట్నం నుంచే తొలి దశలో 350 మంది డ్రైవర్లను ఎంపిక చేసి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు.

ట్రైనింగ్‌లో ఏం నేర్పిస్తారు?

ఈ వినూత్నమైన కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన డ్రైవర్లకు 6 గంటల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అందులో పర్యాటక ప్రాంతాల పూర్తి సమాచారం, పర్యాటకులతో ప్రవర్తించే విధానం, ప్రయాణ ప్రణాళిక రూపకల్పన నేర్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి డ్రైవర్‌కు APTA రూపొందించిన ద్విభాషా (ఇంగ్లీష్-తెలుగు) హ్యాండ్‌బుక్‌ను అందజేస్తారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక టూర్ సర్క్యూట్‌ల గురించిన పూర్తి సమాచారం ఉంటుంది.

గంటల లెక్కన ప్యాకేజీలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని సర్టిఫికేట్ పొందిన డ్రైవర్లను రాపిడో యాప్‌లో ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేస్తారు. పర్యాటకులు తమ అవసరాలకు అనుగుణంగా గంటల లెక్కన బుక్ చేసుకోవచ్చు. ఇందులో 4 గంటల ప్యాకేజీ, 6 నుండి 8 గంటల ప్యాకేజీ, పూర్తి రోజు టూర్ సర్క్యూట్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

భారతదేశంలో ఒక ప్రభుత్వ పర్యాటక శాఖ, ఇలాంటి ప్రైవేట్ రైడ్-షేరింగ్ యాప్‌తో చేతులు కలపడం ఇదే తొలిసారి కావడం విశేషం. విజయవాడలో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వైజాగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. త్వరలో తిరుపతిలోనూ ఈ ప్రాజెక్ట్ ప్రారంభంకానుంది.

గత నవంబర్ 2025లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాపిడో సంస్థ వ్యవస్థాపకుల మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సరైన గైడ్లు దొరక్క టూరిస్టులు పడే ఇబ్బందులను తొలగించడమే కాకుండా, స్థానిక డ్రైవర్లకు అదనపు ఆదాయాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.

ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా తిరుమల వచ్చే భక్తులకు, వైజాగ్ సందర్శించే పర్యాటకులకు ఆటో లేదా బైక్ ఎక్కగానే నమ్మకమైన సమాచారం లభిస్తుంది. అంతేకాదు గంటల వారీగా బుకింగ్ సిస్టమ్ ఉండటం వల్ల పర్యాటకులు మోసపోయే అవకాశం ఉండదు. డిజిటల్ టూరిజంలో ఏపీ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More