జనవరి 25న తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డులో వాహనాల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తరలించేలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించనున్నారు.

జనవరి 25వ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకల్లో భాగంగా ఏడు వాహనాలపై తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభం కానున్న రథసప్తమి వేడుకలు, అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనసేవతో శ్రీమలయప్ప స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి. ఈ సందర్భంగా రథసప్తమి రోజు ఏ సమయంలో ఏ వాహనసేవ జరుగుతుందో తెలుసుకోండి…..
వాహనసేవల వివరాలు :
- తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం.
- ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
- మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
- సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
- రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.
రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దవుతాయి. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు ఉండవు. తిరుపతిలో జనవరి 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీని కూడా రద్దు చేస్తారు.