...
...
Next Story

ప్రవాహాలతో రిజర్వాయర్లు, చెరువులు నింపాలి : ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు

ప్రవాహాలతో రిజర్వాయర్లు, చెరువులు నింపాలని సీఎం చంద్రబాబు అన్నారు. పడుతున్న వర్షాలతో భూగర్భజలాల రీఛార్జ్ అవుతాయని పేర్కొన్నారు.

Published on: Sep 24, 2026, 17:09:13 IST
Advertisement

వర్షాల కారణంగా వస్తున్న ప్రవాహాలతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు పరిధిలో ఉన్న వివిధ నీటి వనరుల్ని కూడా నింపాలని స్పష్టం చేశారు. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగం, డేటా అనలిటిక్స్‌, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్ష ప్రభావంపై సీఎం చర్చించారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూగర్భజలాలు కొంత మేర పెరిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రకాశం బ్యారేజి సహా మున్నేరు సహా ఇతర క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని అన్నారు. ప్రాజెక్టుల దిగువన ఉన్న అన్ని నీటి వనరుల్లో వర్షపు నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అవసరమైన చోట మోటార్లను వాడి నీటిని లిఫ్ట్ చేయాలని స్పష్టం చేశారు. గోదావరి నుంచి వస్తున్న ప్రవాహాల ద్వారా 24 టీఎంసీల నీటిని ఏలేరు రిజర్వాయర్ నింపాలని స్పష్టం చేశారు.

పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకూ నీటి వనరుల్లోకి నీటిని పంపాలన్నారు చంద్రబాబు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వర్షాలు అధికంగా నమోదు అయ్యాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ సహా వివిధ జిల్లాల్లో తీవ్ర వర్ష ప్రభావం కనిపించిందని తెలిపారు.

ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలు, గాలుల తీవ్రత, నదులు-వాగుల్లో పెరుగుతున్న ప్రవాహాలు, రిజర్వాయర్లలోకి చేరుతున్న వరద నీరు, రాబోయే రోజుల్లో అంచనా వేసిన వర్షపాతంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. తాజా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావంతో గోదావరి బేసిన్‌లోని శబరి, ఇంద్రావతి, ఏలేరు, తాండవ, ఎర్రకాల్వ, పంపా, మేఘాద్రిగడ్డ తదితర రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

భద్రాచలం వద్ద సెప్టెంబర్ 26 మధ్యాహ్నానికి వార్నింగ్ లెవల్–1, అదే రోజు రాత్రికి వార్నింగ్ లెవల్–2 దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సెప్టెంబర్ 27 ఉదయం వార్నింగ్ లెవల్–1, సాయంత్రం వార్నింగ్ లెవల్–2 దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. శబరి నదిపై కుంటా వద్ద సెప్టెంబర్ 26 ఉదయానికి వార్నింగ్ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను మార్చడం సాధ్యం కాకపోయినా.. వాటి ప్రభావాన్ని తగ్గించేలా అంతర్గత పరిస్థితులను మార్చుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భూసారాన్ని పెంచడం, సాయిల్‌ టెస్టింగ్‌ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, బయోచార్‌, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్‌గా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం సూచించారు.

అక్టోబరు 2 తేదీన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన చేయనున్నామని, అదే రోజు రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు ముఖ్యమంత్రి. మైక్రోసాఫ్ట్ సహకారంతో రూపొందించిన ఏఐ స్టాక్ ద్వారా కలిగే లాభాలను వివరిస్తూ డెమో ఇవ్వాలని సీఎం సూచించారు.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. విద్యుత్‌ టారిఫ్‌ను పెంచకపోయినా సేవల్లో లోపాల కారణంగా ప్రజల్లో సంతృప్తి తగ్గుతోందని, సరఫరా నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో 287.214 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉన్న నేపథ్యంలో.. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన నీటి లభ్యతపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks