అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం.. పీపీపీ విధానంలో అమ్యూజ్‌మెంట్, ఎకో పార్కుల అభివృద్ధి!

అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్ట్ తీసుకురానుంది ప్రభుత్వం. పీపీపీ విధానంలో అమ్యూజ్‌మెంట్, ఎకో పార్కుల అభివృద్ధి చేయనుంది.

Published on: Jul 17, 2026, 17:04:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అమరావతి రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్టులపై మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ ఏడీసీఎల్ అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.

అమరావతి
అమరావతి

రాజధాని ప్రాంతంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు, భవిష్యత్తు ప్రణాళికలపై అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో భారీ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.

ప్రధాన ప్రాజెక్టులు ఇవే

  • ప్రపంచ స్థాయి రైడ్‌లతో కూడిన అమ్యూజ్‌మెంట్ పార్క్
  • ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా ఎకో టూరిజం పార్క్

రాజధానిలో ప్రధాన రహదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి కావడానికి సమాంతరంగానే.. ఈ టూరిజం ప్రాజెక్టులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని, దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

అమరావతిలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం గతంలోనే భూములు పొందిన పలు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు.. తమ ప్రాజెక్టు పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి నారాయణ. ఈ విషయంలో జాప్యాన్ని సహించేది లేదని, అధికారులు ఆయా సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.

సచివాలయంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథితో పాటు టూరిజం, నగర ప్రణాళిక విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే కృష్ణా నది తీరాన అమరావతి సరికొత్త పర్యాటక వైభవానికి కేంద్రబిందువుగా మారనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More