...
...
Next Story

నెల్లూరులో జూన్ 26 నుంచి రొట్టెల పండుగ.. 14 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా!

నెల్లూరు జిల్లాలో బారాషాహిద్ దర్గా రొట్టెల పండగకు సర్వం సిద్ధమైంది. జూన్ 26 నుంచి పండుగ ప్రారంభమవుతుంది. 14 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.

Published on: Jun 23, 2026, 22:37:54 IST
Advertisement

ఏపీలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సర్వమత సామరస్య వేడుక నెల్లూరు ‘రొట్టెల పండుగ-2026’కు సర్వం సిద్ధమవుతోంది. నెల్లూరు నగరంలోని బారా షాహిద్ దర్గా వేదికగా జూన్ 26 నుంచి నాలుగు రోజుల పాటు ఈ వార్షిక మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పండుగకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతోపాటు ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 14 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నెల్లూరు రొట్టెల పండుగ
నెల్లూరు రొట్టెల పండుగ

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలోని ఉత్సవ కమిటీ ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీరు, వసతి సౌకర్యాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.

భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ అజిత వేజెండ్ల భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు ఈ పండుగకు వస్తారని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

దర్గా పరిసర ప్రాంతాల్లో, నెల్లూరు నగరంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక రూట్ మ్యాప్, పార్కింగ్ స్థలాల ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్గా ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాల నిఘా, భారీగా పోలీస్ బందోబస్తు ఉంటుంది. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు రొట్టెలు వదులుకునే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు, ఈతగాళ్ల ఏర్పాటు చేస్తున్నారు.

నెల్లూరు రొట్టెల పండుగకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. తమ కోర్కెలు నెరవేరిన వారు దర్గా సమీపంలోని స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలను మొక్కుబడిగా సమర్పిస్తారు. కొత్తగా కోర్కెలు కోరుకునే వారు ఆ రొట్టెలను అందుకుంటారు. ఆరోగ్యం, వివాహం, ఉద్యోగం, విద్య, వ్యాపారం, విదేశీ ప్రయాణం వంటి వివిధ కోర్కెల కోసం ఇక్కడ భక్తులు మార్పిడి చేసుకుంటారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలో హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరూ కలిసి పాల్గొనడం ఈ పండుగ ప్రత్యేకత.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe